ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి
● జెడ్పీ అధ్యక్షురాలు మాఝి
● ప్రారంభమైన జిల్లాస్థాయి కృషి మేళ
రాయగడ: రైతుల కోసం ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు వినియోగించుకోవాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక ఐఏసీఆర్ మైదానంలో జిల్లాస్థాయి కృషి మేళా, వ్యవసాయ పరికరాల ప్రదర్శన కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పరికరాలతో రైతులు సాగుచేసి అధిక లాభాలు ఆర్జించాలని ఆకాంక్షించారు. వ్యవసాయ రంగంలో కొత్త పోకడలు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా రైతులు వాటిని అవలంభించాలని హితవు పలికారు. ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ రంగం ఎంతో దోహదపడుతుందన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీలను కూడా అందిస్తోందన్నారు. ఆధునిక వ్యవసాయ పరికరాలను ఈ సబ్సిడీల ద్వారా ఖరీదు చేసుకొని వ్యవసాయ పనులకు వినియోగించాలన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే వ్యవసాయ పంటలతో పాటు సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు.
అధికారులు అందుబాటులో ఉండాలి
వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. రైతులు వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడులను సృష్టించాలంటే, అందుకు సంబంధిత శాఖ అధికారుల ప్రోత్సాహకాలు ఎంతో అవసరమన్నారు. రైతులకు ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. అలాగే కోళ్లు, పందుల పెంపకంలో తగిన మెలకువలు నేర్చుకుంటే ఆ రంగంలో రైతులు అధిక లాభాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వాటర్ షెడ్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ దయానిధి బాగ్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ మేళా ఈనెల 11వ తేదీతో ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment