విపక్షం మండిపాటు
ధరల బాదుడుపై
భువనేశ్వర్: అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన మోహన్ చరణ్ మాఝి సర్కారు ధరల బాదుడు సర్కారుగా మారిందని విపక్ష నేత నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. పప్పు, నూనె, కూరగాయలు, మందులు సకల నిత్యావసర సరుకుల ధరలు చుక్కల్ని తాకాయని, పంట నష్టపోయిన రైతులను ఎవరూ పట్టించుకోవడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా విపక్ష బిజూ జనతా దళ్ ఆందోళనకు ఆయన శంఖారావం చేశారు. సోమవారం జరిగిన ఈ ఆందోళనతో స్థానిక దిగువ పీఎంజీ కూడలి బీజేడీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. సామాన్య పౌరుని దైనందిన జీవనం నానాటికి దుర్భరమవుతోందని, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను అరికట్టడంలో సర్కారు చర్యలు శూన్యంగా పరిణమించాయని విమర్శించారు. ఆందోళన ప్రాంగణం నుంచి విపక్ష నేత నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో మోహన్ చరణ్ మాఝి సర్కారుకు సవాళ్లు విసిరారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమానికి బిజూ జనతా దళ్ కట్టుబడి ఉందని, ధరల పెరుగుదల వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజా పక్షాన నిలిచేందుకు ధరల నియంత్రణ పిలుపుతో ఆందోళనకు నడుం బిగించిందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలు కొత్త ప్రభుత్వం పాలన తీరుని ప్రజల అవగాహనకు అనుకూలంగా వివరించాలని పిలుపునిచ్చారు. అశేష సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలతో పీఎంజీ కూడలి జన సంద్రంగా మారింది. ధరలు తగ్గించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా పలువురు కార్యకర్తలు బంగాళా దుంపలు వంటి కూరగాయల మాలలు మెడలో హారంగా ధరించారు. మరి కొందరు వంట గ్యాస్‌బండలు నెత్తిన పెట్టుకుని ధరల బాదుడు సర్కారుగా నినాదాలు చేసి పరిసరాలు మార్మోగించారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేడీ పిలుపునిచ్చిన తొలి ర్యాలీకి విశేష స్పందన లభించింది.
ఈ ఆందోళనలో బీజేడీ ఎమ్మెల్యేలు తదితర సంస్థాగత ప్రముఖులు, సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం బీజేడీ శిబిరంలో సమైక్యతకు అద్దం పట్టిందని ఆందోళనకారులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం నవీన పట్నాయక్ నేతృత్వంలో బిజూ జనతా దళ్ ఎల్ల వేళల్లో ముందంజలో ఉంటుందని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment