రిమాండ్ ఖైదీలపట్ల అంకిత భావం ఉండాలి
● జిల్లా న్యాయమూర్తి–మౌలానా
పాలకొండ రూరల్: రిమాండ్ ఖైదీలపట్ల సబ్‌జైల్ సిబ్బంది అంకిత భావంతో వ్యవహరించాలని జిల్లా న్యాయమూర్తి మౌలానా అన్నారు. ఈ మేరకు సోమవారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారి ఎస్. సన్యాసిరావుతో కలిసి పాలకొండ సబ్‌జైలును ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి రిమాండ్ ఖైదీలకు అందుతున్న సేవలు, న్యాయసేవలపై ఆరా తీశారు. నేరుగా ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. సబ్‌జైలులో వసతులు, రికార్డులను పరిశీలించారు. ఖైదీల ఆరోగ్య భద్రత పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్ బి.జోగులుకు సూచించారు.
రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్
క్రీడలకు ఎంపిక
సీతంపేట: ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడాపోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు తమ విద్యార్థులు ఎంపికై నట్లు స్థానిక గిరిజన గురుకుల బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ తెలిపారు. సౌత్ జోన్ అథ్లెటిక్స్‌లో 18 సంవత్సరాల లోపు విభాగంలో ద్వితీయస్థానంలో ఎస్.దిలీప్ జావెలెన్‌త్రోలో, షాట్‌పుట్‌లో ఎ.రవి, వందమీటర్ల పరుగుపందెంలో ఎస్.శరత్‌కుమార్, డిస్క్‌త్రోలో ఎస్.జానగిని, త్రిపుల్ జంప్‌లో ఎ.సతీష్ రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు చెప్పారు. హాకీలో ఎస్.గణేష్, ఎస్.విజయ్‌కుమార్, ఎన్.ప్రవీణ్‌కుమార్, ఎస్.సబీర్, సవర శ్రీను, సవర మనోహర్, సవర ప్రదీప్, ఎస్.హర్షవర్ధన్‌లు ఎంపికయ్యారు. ఖోఖోలో ఆరిక అర్జున్ ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్‌తో పాటు పీడీ లక్ష్మణమూర్తి, వైస్‌ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, అధ్యాపకులు ఆ విద్యార్థులను అభినందించారు.
కారు ఢీకొని వ్యక్తి మృతి
గుర్ల: మండలంలోని సొలిపిసోమరాజు పేట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లిమర్లకు చెందిన సింగిరోతు శ్యామ్ కుమార్ (40) మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్లకు చెందిన సింగిరోతు శ్యామ్ కుమార్ మిమ్స్ ఆస్పత్రిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తన అత్తవారి ఊరు రాజాంలో పండగ ఉండడంతో రెండు రోజుల కిత్రం వెళ్లాడు. పండగ ముగించుకుని సోమవారం విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై నెల్లిమర్ల వస్తుండగా గుర్ల మండలంలోని సొలిపిసోమరాజు పేట వద్ద విజయనగరం నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొట్టగా తలకు తీవ్రంగా గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. భర్త మృతి వార్తతో సంఘటన స్థలానికి చేరుకున్న భార్య శిరీష, కుటుంబసభ్యులు కన్నీరుమన్నీరయ్యారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై పి.నారాయణ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్త్నునారు.
విద్యుత్ షాక్‌తో మహిళ..
పాలకొండ రూరల్: మండలంలోని గొట్ట మంగళాపురం గ్రామానికి చెందిన మహిళా రైతు లంక పార్వతి (58)విద్యుత్ షాక్‌తో సోమవారం మరణించింది. బతుకుతెరువు కోసం గ్రామ సమీపంలో కొంత భూమిని కౌలుకు తీసుకుని భర్త సింహాచలంతో కలిసి కొద్దిపాటి కూరగాయలు సాగు చేస్తోంది. రోజూలాగానే కాయగూరలు సేకరించుకునేందుకు పొలానికి వెళ్లిన పార్వతి అప్పటికే తెగిపడి ఉన్న హైపవర్ విద్యుత్ వైర్లు కాలికి తగలగా ఘటనా స్థంలంలోనే మృత్యువాత పడింది. కష్ట సుఖాల్లో తోడైన జీవిత భాగస్వామి తాము బతుకుతెరువుకు కౌలుకు తీసుకున్న పొలంలోనే తనువు చాలించడంతో భర్త గుండెపగిలేలా రోదించాడు. మృతురాలికి ముగ్గురు పిల్లలున్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment