వినతులకు కచ్చితమైన సమాధానం
● కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్
● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 221 వినతులు
విజయనగరం అర్బన్: ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చిన వినతులకు నాణ్యమైన, కచ్చితమైన సమాధానాలు ఇవ్వాలని, రీ ఓపెన్ చేసే పరిస్థితి లేకుండా చూడాలని కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. వినతులు వచ్చిన రోజే అధికారులు ఓపెన్ చేయాలని, వినతులను పూర్తిగా చదివి అర్థం చేసుకుని అడిగిన దానికి కచ్చితంగా సరిపోయే సమాధానాన్ని ఇవ్వాలని ఆదేశించారు. వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎక్కువగా రెవెన్యూకు చెందిన వినతులే వస్తున్నాయని, తహసీల్దార్లు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులు, డివిజినల్, మండల అధికారులతో వినతులపై సమీక్షించారు. వినతులకు అసంపూర్తిగా, సంబంధం లేని సమాధానాలు ఇచ్చినా, గడువు దాటిన తర్వాత స్పందించినా, తప్పుడు లేదా తప్పుదారి పట్టించేలా సమాధానాలు ఇచ్చినా ఆయా శాఖల అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. విజయనగరం జిల్లాకు చెందిన వినతుల రీ ఓపెన్ 1 శాతం ఉందని, వచ్చే వారం నుంచి రీ ఓపెన్ కేసులు జీరో కావాలని స్పష్టం చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్డీ అనిత ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 221 అర్జీలు అందగా, భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 151, వినతులు అందాయి. పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 18 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 14, పంచాయతీ శాఖకు 12, విద్యాశాఖకు 8 వినతులు అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి.
ఉత్సవ ఏర్పాట్లపై వేదిక వారీగా తనిఖీ
విజయనగరం ఉత్సవాల సందర్భంగా నగరంలో నిర్వహించనున్న వేదికల వారీగా చేస్తున్న ఏర్పాట్లపై మంగళవారం ఉదయం తనిఖీ చేయనున్నట్లు కలెక్టర్ అధికారులకు చెప్పారు. ఆయా వేదికల ఇన్‌చార్జ్‌లందరూ వారికి కేటాయించిన వేదికల వద్ద నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment