నవీన వ్యూహం..!
● ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా
బీజేడీ చర్యలు
● ఎన్నికల హామీలపై ప్రజాక్షేత్రంలోకి
● అక్టోబర్ 2 నుంచి
జన సంపర్క్ యాత్ర
నవీన్ పట్నాయక్
భువనేశ్వర్: రాష్ట్ర రాజకీయాల్లో విపక్ష నేతగా నవీన్ పట్నాయక్ సరికొత్త ఉనికిని ఆవిష్కరించే దిశలో అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సీజన్‌ను కంటే అధికంగా ప్రజా సంబంధాల పరిరక్షణ కోసం విశేషంగా శ్రమిస్తున్నారు. ప్రధానంగా ప్రచారం సందర్భంగా బీజేపీ ప్రసారం చేసిన ఎన్నికల హామీల వాస్తవ కార్యాచరణపై గట్టి నిఘా వేసి ప్రజా స్పందనని రంగరిస్తున్నారు. హామీల కార్యాచరణ సాధ్యాసాధ్యాల్ని సామాన్య ప్రజానీకం దృష్టికి తీసుకెళ్లేందుకు వ్యూహం ఖరారు చేశారు. దీనిలో భాగంగా బిజూ జనతా దళ్ సంప్రదాయం ప్రకారం ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడ జన సంపర్క్ పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నారు. బిజూ జనతా దళ్ పాదయాత్ర 2 విడతల్లో నిర్వహిస్తారు. తొలి విడత అక్టోబర్ 2న ప్రారంభమై అక్టోబర్ 6న ముగుస్తుంది. దసరా ఉత్సవాల అనంతరం అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 30 వరకు జన సంపర్క్ యాత్ర కొనసాగనుంది. విభిన్న శైలిలో రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరుని ప్రజల మధ్య ఎండగట్టడమే ఈ యాత్ర లక్ష్యంగా స్పష్టం అవుతుంది. ప్రభుత్వ పాలన వైఫల్యాల్ని విశ్లేషించకుండా వర్ధమాన పరిస్థితుల్లో ప్రజలు ఆశిస్తున్న పాలన శైలి, హామీల వాస్తవ కార్యాచరణ అసాధ్యత, వనరుల కొరత, భావి పరిణామాల తీవ్రతని సగటు ఓటరు దృష్టికి తీసుకుని వెళ్లేందుకు కార్యకర్తల్ని వ్యూహాత్మకంగా రంగంలోకి దింపనున్నారు.
● అంతః కలహాలపై నిఘా
బీజేడీ శిబిరంలో అసంతృప్తులు, అంతః కలహాల సెగ పెచ్చు మీరకుండా నవీన్ పట్నాయక్ అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై అనుభవజ్ఞులైన సీనియర్ సభ్యుల అభిప్రాయాలకు పట్టం గడుతున్నారు. ఇంతకు ముందు బీజేడీ ప్రధాన నాయకులుగా వెలుగొందిన వారి పరపతిపై శీతకన్ను వేసి మరుగున పడేసిన ప్రముఖుల్ని తెరకి ఎక్కించి ప్రజా క్షేత్రంలోకి ప్రేరేపిస్తున్నారు. సంస్థాగతంగా బీజేడీ పూర్వ సత్తా పునరుద్ధరణతో క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య బీజేడీపై అభిప్రాయం, మనోగతాల్ని పసిగట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
జిల్లా నాయకులతో
సమావేశాలు
బిజూ జనతా దళ్ రాష్ట్ర శాఖల ప్రముఖులతో నవీన్ పట్నాయక్ తరచూ స్థానిక శంఖ భవన్‌లో ప్రత్యక్షంగా సమావేశమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీజేడీ జన సంపర్క్ యాత్ర జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నారు. సమావేశం పురస్కరించుకుని ప్రాంతాలవారీగా తాండవిస్తున్న సమస్యలు, కొత్త ప్రభుత్వ పాలన తీరుతో దారి తప్పుతున్న ప్రజా సేవల వ్యవస్థ, సమాజంలో కనీస భద్రత, రక్షణ హామీ వంటి అంశాలపై సామాన్య ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రబోధిస్తున్నారు. అలాగే ప్రజాదరణ బలోపేతం దిశలో బీజేడీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఖరారు చేశారు. అక్టోబర్ 9 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించన్నుట్లు ప్రకటించారు.
విపక్ష హోదాలో ప్రజా పోరాటం
సుదీర్ఘ పాలనకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజానీకానికి తాజా పరిణామాల నేపథ్యంలో విపక్ష హోదాలో బీజేడీ తన వంతు దక్షతని ప్రతిబింబించాలని నవీన్ పట్నాయక్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు. ఈ మేరకు సరికొత్తగా 3 కమిటీలు ఏర్పాటు చేశారు. వీటిని సలహా కమిటీ, సభ్యత్వ నమోదు కమిటీ, కార్యక్రమాల ఆచరణ కమిటీగా పేర్కొన్నారు. ఈ కమిటీల్లో వివాదస్పద ముందంజ నాయకులను దూరం చేశారు. పార్టీ వైఫల్యంపై తీవ్ర మనస్తాపం వ్యక్తం చేసిన వారికి అగ్ర తాంబూలం అందజేశారు. ప్రజాహితం కోసం అమలు చేసిన బీజేడీ పథకాలతో హామీల మేరకు బీజేపీ ప్రభుత్వం కొత్త పథకాలు సమాంతరంగా కొనసాగించేలా విపక్ష పాత్ర పోషించేందుకు జన సంపర్క్ యాత్రలో ప్రజాభిప్రాయ సేకరణకు బీజేడీ సేన రంగంలోకి దిగుతోంది. బీజేడీ కార్యవర్గంలో కొత్త ఉత్సాహం ఉప్పొంగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment