డీఐజీగా నీతి శేఖర్
జయపురం: రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను ఆదివారం బదిలీ చేసింది. దీనిలో భాగంగా కొరాపుట్‌లోని దక్షిణ, పశ్చిమ ప్రాంత డీఐజీగా ఐపీఎస్ అధికారి నీతి శేఖర్‌ను నియమించింది. ఇదివరకు ఇక్కడ విధులు నిర్వహించిన చరణ్‌సింగ్ మీనను కటక్ సెంట్రల్ రేంజ్ డీఐజీగా బదిలీ చేశారు. అలాగే కొరాపుట్ జిల్లా ఎస్పీగా రోహిత్ వర్మను నియమించారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన ఎస్పీ అభినవ సోన్‌కార్‌ను డెంకానల్ ఎస్పీగా బదిలీ చేశారు. అదేవిధంగా నవరంగపూర్ నూతన ఎస్పీగా మిహిర్ పండను నియమించారు.
గుంతలో పడిన
గున్న ఏనుగు
భువనేశ్వర్: భవానీపట్న అటవీ ప్రాంతంలో గున్న ఏనుగు గుంతలో పడింది. కెసింగా అటవీ మండలం పరిధి పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా 30 పైబడిన ఏనుగుల గుంపు పంట పొలాల్లో విధ్వంసకర పరిస్థి తులు సృష్టిస్తున్నాయి. ఈ గుంపునకు చెందిన గున్న ఏనుగుగా భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు స్థానిక పోలీసు, అటవీ శాఖ అధికారులకు ఈ సమాచారం చేరదీశారు. ఘటనా స్థలంలో అధికారుల పరిశీలన చేపట్టారు.
ట్రక్కుని ఢీకొన్న బస్సు
● ఒకరి దుర్మరణం
భువనేశ్వర్: రోడ్డు పక్కన నిలపిన ట్రక్కుని ప్రయాణికుల బస్సు ఢీకొంది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ఒక ప్రయాణికుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ విచారకర సంఘటన జాజ్‌పూర్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. 16వ నంబర్ జాతీయ రహదారి జరకా కూడలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 2 మంది పరిస్థితి విషమంగా కొనసాగుతుంది. వీరిరువుర్ని సత్వర ఉన్నత చికిత్స కోసం కటక్ ఎస్‌సీబీ వైద్య బోధన ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారంతా జాజ్‌పూర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 50 మందితో నిండిన రాజా అనే ప్రైవేటు బస్సు మయూర్‌భంజ్ జిల్లా బరిపద నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తుండగా దురదృష్టవశాతు రహదారి పక్కన నిలబడి ఉన్న ట్రక్కుని ఢీకొంది. స్థానిక ధర్మఛాయ ఠాణా పోలీసులు ప్రమాదానికి కారణమైన బస్సుని స్వాధీనపరచుకుని విచారణ ప్రారంభించారు.
మంచం పట్టిన ఒనికొండ
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి సెరిగుమ్మ పంచాయతీలోని ఒనికొండ గ్రామం మంచం పట్టింది. ఈ గ్రామంలో విష జ్వరాలతో వారం రోజుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో 9 మంది అస్వస్థతతో బాధపడుతున్నారు. మారుమూల ప్రాంతమైన ఈ గ్రామం కొండల మధ్య ఉంది. 23 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో సుమారు 70 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. గత వారం రోజుల్లో జ్వరాల బారినపడి గ్రామానికి చెందిన లలిత మినియాక (26), పలాయి కులిసిక (36) లు మృతి చెందగా పకిరి కులిసిక, ముని కులిసిక, కటి కులిసిక, టిలాయి పిడిసిక, లెంబరి కులిసిక, రాణీ కులిసిక, ఒంలా కులసిక, మాలిక కులిసిక, హర్ష్ ప్రస్కాలు జ్వరంతో మంచానపడ్డారు. అయితే ఇంతవరకు వైద్యశాఖ ఆ గ్రామానికి వెళ్లిన దాఖలాలు లేవు. అదేవిధంగా గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న వారు కూడా అలా మంచానపట్టి ఉంటున్నారు తప్పా చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్లడం లేదు. వారంతా నమ్మే నాటు వైద్యం, పూజలతో నయమవుతుందని వాటిపైనే ఆధారపడుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఇదే సమితికి చెందిన లంబేరి గ్రామంతో వింత జ్వరాలతో ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఒనికొండ గ్రామానికి వెళ్లి మెరుగైన చికిత్సను అందించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment