● గంజాయి
ఆగని గంజాయి అక్రమ రవాణా
20 రోజుల్లో 300కిలోలకు పైగా పట్టివేత
జిల్లాలో 55 మంది క్రయ విక్రయదారుల పరారీ
శ్రీకాకుళం క్రైమ్ : ఒడిశా నుంచి శ్రీకాకుళం మీదుగా విశాఖ వరకు గంజాయి అక్రమ రవాణా హైవేపై అడ్డు లేకుండా సాగుతోంది. పోలీసుల దాడులు, అరెస్టు లు, పెట్రోలింగ్ తనిఖీలు ఎంత ముమ్మరంగా చేసినా గంజాయి బ్యాచ్ ఆగడాలు ఆగడం లేదు. గడిచిన 20 రోజుల్లో 300 కిలోలకు పైగా గంజాయిను పోలీసులు పట్టుకున్నారు.
జిల్లాలో మూడు ప్రధాన చెక్‌పోస్టులు పురుషోత్తపురం(ఇచ్ఛాపురం), పైడిభీమవరం, పాతపట్నం ఉన్నాయి. ఈ మూడింటిలో పురుషోత్తపురం, పాతపట్నం చెక్‌పోస్టుల వద్దనే అధికంగా గంజాయి దొరుకుతోంది. ఒడిశా నుంచి రవాణా అవుతుండడంతో ఈ చెక్‌పోస్టుల వద్దనే గంజాయి పట్టుబడుతోంది. ఒడిశాలోని గంజాం, గజపతి వంటి జిల్లాల్లో సాగు చేస్తున్న వ్యాపారుల వద్ద తక్కువకు కొని మన జిల్లా మీదుగా విశాఖ తరలిస్తున్నారు. జీఆర్పీ స్టేషన్లు లేని ప్రాంతాలను ఎంచుకుని రవాణా చేస్తున్నారు. గంజాయి అలవాటు ఉన్న వారిలో సంఘ విద్రోహ శక్తులు కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పరారీలో 55 మంది..
జిల్లాలో గంజాయికి సంబంధించి క్రయ విక్రయదారులు(పాత నేరాలు, కొత్తవి కలిపి) 55 మందికి పైగా పరారీలో ఉన్నారని అప్పట్లో స్వయంగా ఎస్పీ విలేకరుల సమావేంలో వెల్లడించారు. వీరిలో ఎని మిది మందిని పట్టుకున్నారు. జిల్లాలో గంజాయిని 75 శాతం కళాశాలల ప్రాంతాల్లోను, 25 శాతం నదీ ప్రాంతాల్లోనే వాడుతున్నారు. వీరంతా ఒడిశా నుంచి తెచ్చే స్థానిక వ్యాపారుల నుంచి చిన్న చిన్న ప్యాకెట్లుగా (గ్రాముల్లో) కొనుక్కొని సేవిస్తుంటారు.
ఆపరేషన్ గంజాయితో..
ఈ నెల ఆరంభంలో శ్రీకాకుళంలో ఆపరేషన్ గంజాయి పేరుతో ఎస్పీ మహేశ్వరరెడ్డి సమక్షంలో డీఎస్పీ వివేకానంద, సీఐ పైడపునాయుడులు ఓ కేసును ఛేదించారు. ఈ కేసే మొత్తం జిల్లా పోలీసు యంత్రాంగానికి మార్గదర్శకంగా నిలిచింది. ఆపై దాడులు ఉద్ధృతం చేయడంతో గంజాయి లింకుల న్నీ బయటపడ్డాయి. ఒడిశా నుంచి సీనా అనే వ్యాపారి నుంచి సరఫరా అని తెలిసింది. ఫలితంగా ఈనెల 7న తొమ్మిది మంది అరెస్టు అయ్యారు. ఎనిమిది మంది వ్యసనపరులను డీ అడిక్షన్ సెంటర్లకు పంపారు. ఇరవై రోజుల్లోనే ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట రైల్వేస్టేషన్ల వద్ద, హైవేల దారుల్లో 300 కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నారు.
అవగాహన కల్పిస్తాం..
గంజాయి క్రయ విక్రయాలు, అక్రమ రవాణాకి సంబంధించిన ఫిర్యాదుల నమోదు, డి–అడిక్షన్ కేంద్రాల సేవలకు టోల్ ఫ్రీ నంబర్ 14446కు డయల్ చేయాలి. రిమ్స్‌లో డి–అడిక్షన్ సెంటర్‌ను కూడా పూర్తిస్థాయిలో నిర్వహిస్తాం. జిల్లాలోని రంగస్థల కళాకారులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు, ఎన్‌జీఓల సహకారంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం.
– స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కలెక్టర్, శ్రీకాకుళం
షీట్లు తెరుస్తున్నాం
ఒడిశా నుంచే మనకు గంజాయి సరఫరా అవుతుంది. చెక్ పోస్టులు, టోల్‌ప్లాజాలు, క్రైమ్‌స్పాట్‌ల వద్ద ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టాం. డీజీపీ కార్యాలయం నుంచి డ్రగ్ ఐడెంటిటీ కిట్ సాయంతో పరిశోఽధిస్తున్నాం. ఈ ఏడాదిలోనే 24 కేసుల్లో 71 మందిని అరెస్టు చేసి 490 కిలోల గంజాయి సీజ్ చేశాం. 50 మందికి పైగా సస్పెక్ట్ షీట్స్, ఏడుగురిపై రౌడీషీట్ తెరిచాం.
– కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment