పార్వతీపురం టౌన్: దీపం పథకం క్రింద జిల్లాలో డీబీటీ ద్వారా రూ.164 కోట్లు బదిలీ కానుందని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో దీపం–2 పథకం కింద 1,97,727 మందిని అర్హులుగా గుర్తించామని పేర్కొన్నారు. దీపం–2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. దీపం పథకంలో భాగంగా ఉచిత సిలిండర్లు పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం పార్వతీపురం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే బోనెల విజయ చంద్రతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం పొందేందుకు ఆధార్ కార్డు నెంబరు, రేషన్/బియ్యం కార్డు నెంబరు, ఆధార్ నెంబరుతో లింకు చేసిన బ్యాంకు ఖాతా (ఎకౌంటు) నెంబరు, గ్యాస్ కనెక్షన్ నెంబరు ఉంటే సరిపోతుందని వివరించారు. లబ్ధిదారులు తమ వివరాలు లేకపోతే ఆయా సంస్థలు, శాఖల నుండి వివరాలు పొంది నమోదు చేసుకొని ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందవచ్చని ఆయన వివరించారు. దీపం పథకంలో భాగంగా లబ్ధిదారులు తమ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్‌కు బుకింగ్ చేసి గ్యాస్ ధర, గ్యాస్ ఏజెన్సీ వారికి మొదట చెల్లించాలని, అనంతరం అర్హులైన లబ్ధిదారుకు మొబైల్ నెంబరుకు మెసేజ్ వస్తుందన్నారు. మెసేజ్ వచ్చిన లబ్ధిదారుకు గ్యాస్ ఏజెన్సీకి చెల్లించిన మొత్తం నగదు తిరిగి వస్తుందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల వారికి 24 గంటలల్లో, గ్రామీణ ప్రాంతాల వారికి 48 గంటల్లోగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్‌లు ఉచితంగా అందజేసేందుకు అక్టోబర్ 31 నుండి శ్రీకారం చుట్టిందని చెప్పారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment