ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
సీతంపేట: ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొంది. మరొక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... సీతంపేట మండలం హడ్డుబంగి–లోవగూడ గ్రామాల మధ్య ఉన్న అప్పలమ్మ వంతెన వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాలకొండ మండలం ఎంకే రాజపురం గ్రామానికి చెందిన పైల రామ్మోహనరావు(27), ఆయన స్నేహితురాలు రేగిడి గ్రామానికి చెందిన కాజీపేట శ్రావణి కొత్తూరు నుంచి ద్విచక్ర వాహనంపై గురువారం వస్తుండగా వీరిని అప్పలమ్మ వంతెన వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే 108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రామ్మోహనరావు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. శ్రావణికి కుడి చేయి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి తండ్రి శ్రీరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అమ్మన్నరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ వృద్ధురాలు..
రాజాం సిటీ: మండల పరిధి వీఆర్‌అగ్రహారం గ్రామానికి చెందిన బెజ్జి చిన్నమ్మ (93) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందిందని ఏఎస్‌ఐ రమణమ్మ శుక్రవారం తెలిపారు. రేకుల ఇంట్లో నివాసం ఉంటున్న చిన్నమ్మికి చుట్ట తాగే అలవాటు ఉంది. చూపు కనిపించని ఆమె చుట్టను పక్కనే పడేయడంతో బట్టకు అంటుకుని శరీరం కొంతభాగం కాలిపోయిందని ఏఎస్‌ఐ తెలిపారు. స్థానికులు గమనించి ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని పేర్కొన్నారు. మృతురాలి కుమారుడు లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment