కొలువుదీరిన కాళీమాత
భువనేశ్వర్: పూరీ జిల్లా అత్యంత పుణ్య ప్రదమైన క్షేత్రాలతో భాసిల్లుతోంది. ఈ జిల్లాలో శక్తి క్షేత్రాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. పూరీ పరిసర ప్రాంతాల్లో కాళీమాత అక్కాచెల్లెళ్లుగా పూజలందుకోవడం విశేషం. కామరూప, ఉగ్రతార, దక్షిణ కాళీ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. వీరిలో కామరూప పెద్దక్క, ఉగ్రతార చిన్నక్క, దక్షిణ కాళీ చెల్లెలుగా వెలుగొందుతోంది. దీపావళి పురస్కరించుకుని ఆయా క్షేత్రాల్లో ప్రత్యేక శక్తి ఆరాధనలు విశేషంగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పూరీ జిల్లా బీర ప్రతాప్‌పూర్ ప్రాంతంలో అక్క కామరూప, సమజాజ్ పూర్‌లో చిన్నక్క ఉగ్రతార, బీర గోవింద పూర్ గ్రామంలో చెల్లెలు దక్షిణ కాళీ కొలువుదీరి ఉన్నారు.
కాళీమాత పూజలు ప్రారంభం
పర్లాకిమిడి: స్థానిక కటికవీధి నెహ్రూ జంక్షన్ వద్ద దీపావళి రోజైన గురువారం నుంచి కాళీమాత పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 50 ఏళ్లుగా నెహ్రూ జంక్షన్‌లో దీపావళి నుంచి జరుపుతున్నారు. కార్తీక మాసంలో కాళీదేవిని ఆరాదిస్తే అంతా శుభం జరుగుతుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం. తెలుగు సోండి వీధి వద్ద అమవాస్య అర్ధరాత్రి నుంచి కాళీ మందిర్‌లో కూడా పూజలు ప్రారంభించారు. కాళీమాతా పూజలు పదిరోజుల పాటు నిర్వహిస్తామని, రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, పూజా కమిటీ అధ్యక్షులు భరత్ భూషణ్ మహాంతి తెలియజేశారు.
కాళీమాత విగ్రహావిష్కరణ
కొరాపుట్: రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖా మంత్రి నిత్యానంద గోండో 45 అడుగుల కాళీమాత విగ్రహం ఆవిష్కరించారు. నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితిలో బెంగాలీ శరణార్థులు క్యాంప్ ఉండే దండ కారణ్య ప్రాంతంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వేలాది మంది శరణార్థులు స్థిరపడ్డారు. వారికి కాళీమాతపై అపారమైన నమ్మకం ఉంటుంది. ప్రతీ దీపావళి నుంచి వీరు కాళీ పూజలు ఘనంగా చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. పశ్చిమ బంగా నుంచి వచ్చిన కళాకారులు ఈ విగ్రహం తయారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment