లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు
రాయగడ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక బాలాజీ నగర్‌లోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం లక్ష్మీఅమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల నేతృత్వంలో జరిగిన పూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారికి వివిధ పుష్పాలతో పూజించారు. కరెన్సీ నోట్లతో అలంకరించారు.
ఉత్తమ వైద్యాధికారిగా అనూష
టెక్కలి: కర్ణాటకలో వైద్యాధికారిగా పనిచేస్తున్న టెక్కలికి చెందిన గజవిల్లి అనూష ఆ రాష్ట ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ వైద్యాధికారి అవార్డును అందుకున్నారు. కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు అనూష కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. ఈమెకు అవార్డు లభించడం పట్ల సొండి కుల సంక్షేమ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఆలయం కూల్చివేత అవాస్తవం
రణస్థలం: మండలంలోని చిల్లపేట రాజాం పంచాయతీ బొడ్డపాడులో పురాతన శివాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం కూల్చివేశారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. శుక్రవారం మాజీ సర్పంచ్ సీహెచ్ శ్రీనివాస రెడ్డి, గ్రామస్తులు విలేకరులతో మాట్లాడుతూ శివాలయం చాలా పురాతనమైనదని, ఇటీవల కురిసిన వర్షాలకు సగం పడిపోయిందని, మిగతా కోవెల కూడా ప్రమాదకరంగా మారడంతో రానున్న కార్తీకమాసం దృష్ట్యా పురోహితుల సూచనల మేరకే తొలగించామని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఆలయం సరికొత్తగా నిర్మిస్తామని తెలిపారు. ఇద్దరు పురోహితుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా గుప్త నిధుల కోసం కూల్చివేశారంటూ వదంతులు సృష్టించారని చెప్పారు.
పాతపాడులో పూరిల్లు దగ్ధం
సరుబుజ్జిలి: మండలంలోని తెలికిపెంట పంచాయతీ పాతపాడులో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో నివగాన ముఖలింగంకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. దుస్తులు, సామగ్రి, ధాన్యం కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.
గుర్రాలపాలెంలో..
ఎచ్చెర్ల: లావేరు మండలం గుర్రాలపాలెం ఎస్సీ కాలనీలో నేతల పెంటయ్యకు చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న సామగ్రి ఎల్‌ఈడీ టీవీ రూ.25 వేలు నగదు, బంగారం, కుమారుడి ఒరిజనల్స్ సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి.
సచివాలయంలో
చోరీకి యత్నం
పాతపట్నం: మండలంలోని కొరసవాడ గ్రామ సచివాలయంలో గురువారం రాత్రి గుర్తు తెలి యని వ్యక్తులు చొరబడి బీరువా లాకర్లు తెరిచారు. గ్రామ శివారున కార్యాలయం ఉండటం, దీపావళి కావడంతో తాళాన్ని యాక్సా బ్లేడ్‌తో కట్ చేసి లోపలికి వెళ్లి సర్వేయర్ అసిస్టెంట్‌కు చెందిన బీరువా లాకర్ తొలగించారు. శుక్రవారం ఉదయం పంచాయతీ సెక్రటరీ కృష్ణంరాజు, సచివాలయ ఉద్యోగులు రాగా.. కార్యా లయం తెరిచి ఉండడాన్ని గుర్తించి సర్పంచ్ ఉమాకు తెలియజేశారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ జి.సింహచలం ఘటనా స్థలానికి చేరుకుని బీరువా లాకర్లను పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. ఒకటో తేదీ పెన్షన్ డబ్బులు బీరువా లాకర్‌లో ఉంటాయని భావించి చోరీకి ప్రయత్నించి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలిపారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
నరసన్నపేట: స్థానిక శివనగర్‌కాలనీలో బగ్గు సూర్యనారాయణ (45) అనే వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. బుధవారం కూలి పనికి వెళ్లి ఇంటి సమీపంలో ఉన్న చెరువులో స్నానం చేసేందుకు దిగగా ప్రమాదవశాత్తూ కూరుకుపోయి మృతి చెందాడు. సమాచారం అందుకు న్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం చేయించారు. భార్య నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ దాలినాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment