పండగ రోజు విషాదం
భోగాపురం: దీపావళి పండగ రోజున మండలంలోని కొండ్రాజుపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండ్రాజుపాలెం గ్రామానికి చెందిన గనగళ్ల దానయ్య(15) అనే బాలుడు రామచంద్రపేట ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. గురువారం దీపావళి పండగ రోజు సెలవు కావడంతో తన స్నేహితులతో కలిసి గురువారం ఉదయం సముద్రంలో స్నానానికి వెళ్లాడు. సముద్రపు అలలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడడంతో అలల ధాటికి బాలుడు గల్లంతయ్యాడు. ఇది గమనించిన తోటి స్నేహితులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు హుటాహుటిన సముద్రం లోపలికి వెళ్లి బాలుడు కోసం వెతికారు. బాలుడు ఆచూకీ ఎంతకీ కానరాకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చేసారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ కిషోర్‌కుమార్ గ్రామానికి చేరుకుని మైరెన్ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. మరుసటి రోజు శుక్రవారం సాయంత్రం బాలుడు మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. బాలుడు తల్లిదండ్రులు దానమ్మ, తాతయ్యలు కుమారుడి మృతదేహం వద్దకు చేరుకుని బోరున విలపించిన తీరు అందరినీ కలిచి వేసింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లోకం నాగమాధవి, సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉండి అదుకుంటామని వారికి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment