తేనెటీగల దాడిలో దంపతులకు గాయాలు
● పరిస్థితి విషమం
రాయగడ: తేనెటీగల దాడిలో దంపతులు గాయపడ్డారు. రాయగడ జిల్లాలోని పద్మపూర్ సమితి ఖమపదర్ గ్రామంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకోగా.. ధుశ సబర్, అతని భార్య ఆరద సబర్ గాయపడ్డారు. తమ పొలంలో పనులు చేస్తున్న దంపతులపై సమీపంలోని చెట్టుపై నుంచి వచ్చిన తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలో ఉన్నవారు చూసి ఆంబులెన్స్ సహాయంతొ స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం గుణుపూర్ తరలించారు.
ఘనంగా నీలమణిదుర్గ
మందిర ప్రతిష్టాపన
పర్లాకిమిడి: గుసాని సమితి ఎం.ఎస్.పూర్ పంచాయతీ సింగిపురంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోడూరు నారాయణరావు బుధవారం నీలమణి దుర్గా మందిరాన్ని ప్రతిష్టించారు. కార్యక్రమంలో బీసీసీ బ్యాంక్ డైరెక్టర్లు కోడూరు కిరణ్‌కుమార్, బల్ల ధనుంజయ (ఉప్పలాడ), కాశీనగర్ సమితి మాజీ అధ్యక్షుడు ఛిత్రి సింహాద్రి, నృసింహాచరణ్ పట్నాయక్, మాజీ జెడ్పీటీసీ జి.శ్రీధరనాయుడు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
పసికందు స్వాధీనం
రాయగడ : తొమ్మిది రోజుల వయసు గల పసిబిడ్డ తల్లిదండ్రులే రూ.20 వేలకు విక్రయించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన సీడబ్ల్యూసీ సిబ్బంది పెంపుడు తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ ఫరూల్ పట్వారి ఆదేశాల మేరకు పసికందును కొనుగోలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామానికి చెందిన కె.రాజశేఖర్, నందిని దంపతులు పసిబిడ్డతో సహా బుధవారం సీడబ్ల్యూసీ కార్యాలయానికి హాజరయ్యారు. కమిటీ సభ్యురాలు ప్రియదర్శిని మహాంకుడొ ఆ పసికందును స్వాధీనం చేసుకున్నారు. నువాపడ బస్తీకి చెందిన కుముదు గంట, రాహుల్ దంపతులు తొమ్మిది రోజుల పసికందును విక్రయించిన సంగతి తెలిసిందే. ఆర్థిక పరిస్థితుల కారణంగా బిడ్డను విక్రయించామని అంగీకరించినప్పటికీ బుధవారం విచారణకు మాత్రం గైర్హాజరయ్యారు. బిడ్డను శిశు కల్యాణ కేంద్రానికి అప్పగించామని మహాంకుడొ విలేకర్లకు తెలిపారు.
మూడు జిల్లాలకు
పొగమంచు హెచ్చరిక జారీ
భువనేశ్వర్: రాష్ట్రంలోని మూడు జిల్లాలకు పొగమంచు హెచ్చరికను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. రెండు రోజులుగా చలి క్రమంగా పుంజుకుంటుంది. చలి తీవ్రత మున్నుందు మరింత ఎక్కువగా ఉంటుందని స్థానిక వాతావరణ కేంద్రం సూచించింది. ఉత్తర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో అత్యధిక చోట్ల పొగ మంచు దట్టంగా కమ్మే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం ముందస్తు సమాచారం జారీ చేసింది. ఈ జాబితాలో కంధమల్, కలహండి, సుందరగడ్ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment