● మండీలను ప్రారంభించిన మంత్రి కృష్ణ చంద్ర పాత్రో
భువనేశ్వర్: రాష్ట్రంలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఎటువంటి అవకతవకలు, అక్రమాలకు తావు లేకుండా ఈ ప్రక్రియని అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. మండీల్లో ధాన్యం నల్ల బజారు నివారణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పశ్చిమ ఒడిశా బర్‌గడ్ కేంద్రంగా ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. బర్‌గడ్ కొళాపాణి మండీ ప్రాంగణంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో కొనుగోలు మండీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ జిల్లాలో మూడు కొనుగోలు మండీలను ఏర్పాటు చేసినట్టు మంత్రి ప్రకటించారు. ధాన్యం కొనుగోలు రైతాంగానికి పండుగ దినంగా వ్యాఖ్యానించారు. బర్‌గడ్ జిల్లా రాష్ట్రం అన్నదాతగా పేరొందింది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియని ఈ జిల్లా నుంచి ఆరంభించినట్లు మంత్రి వెల్లడించారు. గురువారం నుంచి అంచెలంచెలుగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో మండీలు తెరిచి ధాన్యం కొనుగోలు చేపడతామని పేర్కొన్నారు. ఈ ఏడాది వరి క్వింటాల్ కొనుగోలు కనీస మద్దతు ధర ఎమ్‌ఎస్‌పీ రూ. 2,300. సాగు పెట్టుబడి ప్రోత్సాహం కింద రైతాంగానికి అదనంగా రూ. 800 చెల్లిస్తారు. తొలి విడత కింద కనీస మద్దతు ధర అక్కడికక్కడే చెల్లిస్తారు. అదనపు మొత్తం డిసెంబరు నెల ఎనిమిదో తేదీ నుంచి విడుదల చేస్తారు. రైతాంగం పొదుపు ఖాతాలకు ప్రత్యక్షంగా నగదు బదిలీ డీబీటీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
సరిహద్దు సీల్
మండీల్లోకి ఇరుగు పొరుగు రాష్ట్రాల ధాన్యం చొరబడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాలు సీలు చేసి ఈ అక్రమ చొరబాటుకు కళ్లెం వేస్తున్నారు. దీంతో రాత్రింబవళ్లు నిఘా ఏర్పాటు చేయడం విశేషం. సరిహద్దు ప్రాంతం మార్గాల గుండా అక్రమంగా రాష్ట్రేతర ప్రాంతాల ధాన్యం రాకుండా సీసీటీవీ వ్యవస్థ పని చేస్తుంది. పోలీసు పహారా నిరవధికంగా కొనసాగుతుంది.
మండీల్లో మౌలిక సౌకర్యాలు
ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా చలామణి అయ్యే మండీల్లో రైతాంగానికి మౌలిక సౌకర్యాలు కల్పించినట్లు రాష్ట్ర సహకార శాఖ మంత్రి ప్రదీప్ బలసామంత్ తెలిపారు. మండీ ప్రాంగణాల్లో వరి విక్రయించేందుకు విచ్చేసిన రైతాంగం సౌకర్యం కోసం ఆహార కేంద్రాలు, సౌచాలయాలు, మంచినీటి వంటి సదుపాయాల్ని ఏర్పాటు చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం స్థానిక మండీల్లోకి చొరబడకుండా నివారించే సన్నాహాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రత్యక్షంగా పాలుపంచుకుంటారని మంత్రి ప్రకటించారు.
అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ
మండీల్లో ధాన్యం కొనుగోలు, అమ్మకం వరకు జరిగే ప్రక్రియని ప్రభుత్వ అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. నాలుగు నుంచి ఐదు మండీల పర్యవేక్షణ కోసం ఒక్కో ప్రభుత్వ అధికారిని నియమించినట్లు రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment