తుఫాన్ నష్టం అంచనాకు కేంద్ర బృందం
భువనేశ్వర్ : దానా తుఫాన్ ఇటీవల రాష్ట్రానికి అపార నష్టం మిగిల్చిందని, దీనిని అంచనా వేసేందుకు కేంద్రం నుంచి ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ రాష్ట్రంలో పర్యటించనుందని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్‌కుమార్ పూజారి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 27 వరకు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన ప్రభావిత భద్రక్, బాలేశ్వర్, కేంద్రాపడా జిల్లాల్లో కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పి.కె.రాయ్ ఆధ్వర్యంలో బృందం పర్యటించి నష్టం అంచనా వేస్తుందని చెప్పారు. బాధితులకు పక్కా ఇళ్లు మంజూరయ్యేలా కేంద్ర బృందానికి అభ్యర్థించనున్నట్లు మంత్రి వివరించారు. పర్యటనలో భాగంగా ఈ నెల 26న రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజాతో బృందం సమావేశం అవుతుందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితో సమావేశమై నష్టం అంచనా నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్రం నుంచి తుఫాన్ నష్టం పునరుద్ధరణ, పునర్నిర్మాణ తదితర సాయం కోసం అభ్యర్థిస్తామని రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్‌కుమార్ పూజారి తెలిపారు.
ఔషధ కేంద్రాల సేవలు
నిరంతరం
భువనేశ్వర్: రాష్ట్రంలో నిరామయ ఔషధ కేంద్రాలు రాత్రింబవళ్లు పని చేస్తాయని ప్రభుత్వరంగ సంస్థల శాఖ మంత్రి కృష్ణ చంద్ర మహాపాత్రొ బుధవారం తెలిపారు. ఆదేశాలు అమలుకు నిఘా ఏర్పాటు చేస్తామని, స్క్వాడ్‌లు తనిఖీలు చేస్తుంటాయని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment