రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
జయపురం: మార్నింగ్ వాక్‌కు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ సంఘటన బొరిగుమ్మలో చోటు చేసుకుంది. బొరిగుమ్మ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పితాంబర పూజారి(59) రోజూ మార్నింగ్ వాక్‌కు వెళ్తుంటారు. ఎప్పటిలాగానే శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో బొరిగుమ్మ 28వ నంబర్ రాష్ట్ర రహదారి దుల్లాగుడ సమీప రాణిగుడ వరకు వెళ్లి బొరిగుమ్మ తిరిగి వస్తుండగా ఒక గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో పూజారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని చూచిన వారు వెంటనే బొరిగుమ్మ పోలీసులకు తెలియజేశారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూజారిని బొరిగుమ్మ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పూజారి మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. మృతదేహానికి పోస్టుమార్టం జరిపి అతడి బంధువులకు అప్పగించారు. బొరిగుమ్మ సబ్‌డివిజన్ పోలీసు అధికారి తపశ్వణీ కొహార్, ఎస్‌ఐ రొచిత మడకామి, మానస హేబ్రమ్, మేఘనాత్ సోరెన్, ద్రోణాచార్య బాగ్, ఏఎస్‌ఐ సస్మిత నాయిక్, గోపాల్ హరిజన్, బసంత కుమార్ బాగ్, చందన ప్రసాద్ మఝి తదితరులు నివాళులర్పించారు. ఢీకొన్న వాహణం కొట్‌పాడ్ దిశలో వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
రైతుల సేవలో బొరిగుమ్మ
లేంపునకు రాష్ట్రస్థాయి బహుమతి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగు మ్మ లేంపు రాష్ట్ర స్థాయిలో రెండో ఉత్తమ బహు మతి పొందింది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ జయదేవ్ భవనంలో గురువారం నిర్వహించిన 71 వ అఖిల భారత సహకారోత్సవాల్లో బొరిగుమ్మ లేంపునకు ఈ గౌరవం దక్కింది. విధానసభ స్పీకర్ సురమ్ పాఢీ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని బొరిగుమ్మ లేంప్ వ్యవసాయ ఉన్నతికి రైతులకు అందించిన సేవలకు మెచ్చి ప్రశంసా పత్రంతో పాటు మెమోంటో లతో లేంపు అధ్యక్షుడు లాలూమణిసంగ్, లేంపు మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న మిశ్ర సన్మానించారు.
ఏడు బైక్‌లు సీజ్
జయపురం: శబ్ద కాలుష్యం చేస్తున్న బైక్‌లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గురువారం రాత్రి జయపురం పట్టణ పోలీసులు శబ్దాలు సృష్టిస్తున్న 7 బైక్‌లను సీజ్ చేసి వాటి సైలెన్సర్లను తొలగించినట్లు పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్ దొళాయి శుక్రవారం వెల్లడించారు. ఆయా మోటారు బైక్ యజమానుల నుంచి రూ.4,000 జరీమానా వసూలు చేసినట్లు ఆయన వెల్లడించారు. పోలీసు సిబ్బంది 326 విజయవాడ–రాంచీ జాతీయ రహదారిలో తనిఖీలు చేస్తూ ఎక్కువ శబ్దంతో వెళ్తున్న బైక్‌లను ఆపి సైలెన్సర్లను తొలగించారు. సైలెన్సర్లను మార్చిన తర్వాత వారికి బైక్ లు అప్పగించినట్లు తెలిపారు.
గుడారిలో గంజాయి తోట
ధ్వంసం
రాయగడ: జిల్లాలోని గుడారి పోలీస్ స్టేషన్ పరిధి గుమ్మి అటవీ ప్రాంతంలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి తోటను పోలీసులు, అబ్కారి శాఖ అధికారులు సంయుక్తంగా శుక్ర వారం నిర్వహించిన దాడుల్లో నాశనం చేశారు. రహస్యంగా అందిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ ఆదేశానుసారం సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయితోను గుర్తించి కట్ చేసి తగులబెట్టారు. సుమారు 18 వేల గంజాయి మొక్కలు నాశనం చేసినట్టు అధికారులు చెప్పారు.
రాష్ట్రపతి పర్యటనకు సన్నద్ధత
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఆమె 4 రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు నెల 3 నుంచి 7వ తేదీ వరకు పలు జిల్లాలు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంకు స్థాపన, ప్రముఖులతో భేటీ, విద్యార్థులతో ముచ్చటతో స్వగ్రామం సందర్శన, సొంత ఇంటిలో బస వంటి కార్యక్రాలు ఉన్నాయి. రాష్ట్ర పర్యటన ముగించుకుని కోల్‌కత్తా మీదుగా న్యూఢిల్లీ తిరుగు పయనం అవుతారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఆగమనం నుంచి తిరుగు ప్రయాణం వరకు ఆద్యంతాలు భద్రతా ఏర్పాట్లతో వసతి, పర్యటన ఇతరేతర అనుబంధ కార్యకలాపాల సన్నద్ధతని ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా శుక్రవారం సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment