29నుంచి ఎంఎస్‌ఎంఈల సర్వే
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) సర్వేను ఈనెల 29 నుంచి ప్రారంభించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్, మండలాల పరిధిలో జరిగే ఎంఎస్‌ఎంఈల సర్వేకు కమిషనర్లు, ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. సర్వేకోసం ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించిందని, యాప్ వినియోగంపై గురువారం శిక్షణ ఇచ్చి శుక్రవారం నుంచి సర్వేను ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి సచివాలయం సిబ్బంది ఒక్కొక్కరు రోజుకు ఆరు సర్వేలు పూర్తిచేయాలని సూచించారు. ఈ సర్వేను 2025 ఫిబ్రవరి 1వ తేదీనాటికి పూర్తిచేయాలని, అయితే సంక్రాంతిలోగా ఈసర్వేను పూర్తిచేసేందుకు అవసరమైన ప్రణాళికలు రచించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఎంవీ.కరుణాకర్, సహాయ సంచాలకుడు సీతారాం, ఐపీఓ కరీముల్లా, డీపీఓ టి.కొండలరావు, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment