పురుగు అశించిన వరికుప్ప కాల్చివేత
● పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు
గంట్యాడ: ఆరుగాలం కష్టించి పండిన పంట పురుగు రూపంలో నేలపాలు కావడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు పాడైన వరి దిబ్బను కాల్చేశాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే గంట్యాడ మండలంలోని బుడతనాపల్లి గ్రామానికి చెందిన చల్లరాము ఏడు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. రెల్ల రాల్చు పురుగు మూలాన వరి పంట తీవ్రంగా దెబ్బతింది. దీన్ని తట్టుకోలేకపోయిన రైతు రెండు వరి దిబ్బలను కాల్చేశాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు బుధవారం రైతు రాము కాల్చేసిన వరి పంటను పరిశీలించారు. దెబ్బతిన్న మిగతా వరి దిబ్బ(కుప్ప)లను పరిశీలించారు. సమస్య ఉంటే తన దృష్టికిగాని మండల వ్యవసాయ అధికారి దృష్టికి గానీ తీసుకు రావాల్సిందని రైతుకు సూచించారు. జిల్లాలో రెల్చ రాల్చు పురుగు వల్ల అధిక నష్టం వాటిల్లిన రైతుల వివరాలు సేకరించాలని వీఏఏలకు సూచించినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఈ సందర్భంగా తెలిపారు. రైతులు రెల్ల రాల్చు పురుగు అశించిన పంటకు క్లోరిఫైరిపాస్ మందు పిచికారీ చేయాలని సూచించారు. పురుగు మందు పిచికారీ చేసిన చోట పంటనష్టం తీవ్రత తగ్గిందని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏ నాగభూషణరావు, ఏఓ శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment