చెన్నకేశవుని చెంత పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవతో వీరాచారవంతులు
కారెంపూడి: పల్నాటి రణక్షేత్రం కారెంపూడి (కార్యమపూడి)లో పల్నాటి వీరారాధన ఉత్సవాలు రాత్రితో ముగిశాయి. శనివారం జరిగిన కళ్లిపాడు ఘట్టంతో ఐదు రోజుల వీరారాధన ఉత్సవాలు ముగిశాయి. నాగులేరు గంగధారి మడుగు ఒడ్డున ఉదయం పల్నాటివీరుల ఆయుధాలకు వీరాచారవంతులు పూజ కట్టుకున్నారు. ఆయుధాలను అలంకరించుకున్నారు. తర్వాత పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవతో చెన్నకేశవస్వామి చెంతకు తరలివెళ్లారు. ఆయుధాలతో వీరాచారవంతులు చెన్నకేశవునికి మొక్కిన అనంతరం అర్చకుడు సత్యనారాయణాచార్యులు ఇచ్చిన తీర్థం తీసుకున్నారు. అక్కడ నుంచి అంకాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లి అక్కడ కూడా శిరస్సు వంచి ఆయుధాలతో అమ్మవారిని మొక్కారు.
ఉద్విగ్నంగా లంకన్న ఒరుగు ఘట్టం
ఆలయం నుంచి ప్రధాన వీధిలోకి వచ్చాక నాగమ్మ వేషఽం ధరించిన శేషు అనే ఆచారవంతుడు వారికి తారసపడడం అక్కడ నుంచి నాగమ్మ వేషంలో ఉన్న ఆచారవంతుని తరుముకుంటూ పల్నాటి వీరాచారవంతులు వీరుల గుడి ఆవరణలో ఈశాన్య దిక్కున కళ్లి తోరణం వద్ద ఉన్న లంకన్న ఒరుగు వద్దకు పరుగులతో చేరుకున్నారు. బ్రహ్మనాయుడు పాత్రలో ఉన్న పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ నిర్జీవంగా పడి ఉన్న లంకన్నను లేపి అతనికి శంఖుతీర్థం ఇచ్చి ప్రాణ ప్రతిష్ట చేసిన సన్నివేశం ఆవిష్కృతమైంది. లంకన్నగా ఇక్కుర్తికి చెందిన ఆవుల బాలచంద్ర శనివారం ప్రారంభ ఘడియల నుంచి శవంలాగా ఉండేలా అక్కడ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం పల్నాటి వీరాచారవంతులు పీఠాధిపతితో విషాదవదనాలతో పరుగున తరలివచ్చి లంకన్నను లేపే ఘట్టం ఉద్విగ్నంగా కొనసాగింది. తర్వాత లంకన్నను నాగులేరు గంగధారి మడుగు పడమర వైపునకు తీసుకెళ్లారు. అక్కడ లంకన్నతో స్నానం చేయించి అనంతరం వీరుల గుడికి చేరుకుని ఆయనతో కత్తి సేవ చేయించారు.
కళ్లికొరిగిన వీరుల ఆయుధాలు
అనంతరం మధ్యాహ్నం వీరుల ఆయుధాలకు నాగులేరు గంగధారి మడుగు ఒడ్డునే అలంకారాలు తీసివేశారు. ఆయుధాలను నాగులేరులో శుభ్రం చేసి వీరాచారవంతులు కూడా స్నానాలు చేశారు. చీకటి పడిన తర్వాత అక్కడ నుంచి అలంకారాలు లేని ఆయుధాలతో రణక్షేత్ర వీధుల్లో గోవింద నామ స్మరణతో పరుగులతో కలియతిరిగారు. ఆ సమయంలో చాలా మంది ప్రజలు రోడ్లపై పడుకున్నారు. వీరాచారవంతులు తమ ఆయుధాలతో వారిని దాటుకుంటూ వెళ్లారు. అలా వారంతా వీరుల గుడికి తూర్పున ఉన్న కళ్లిపోతు రాజు మండపం వద్ద ఏర్పాటు చేసిన కళ్లెమండైపె వీరుల ఆయుధాలను వాల్చారు. అప్పటికే వీరాచారవంతుల కుటుంబ సభ్యులు అన్ని సర్దుకుని ఆ ప్రాంతానికి చేరారు. వారు మళ్లీ రణక్షేత్ర పొలిమేరలోకి రాకుండా వారి స్వగ్రామాలకు పయనమయ్యారు. అనంతరం వేలాదిగా ప్రజలు తరలివచ్చి కళ్లె మండలు తీసుకుని పొలిపొలి అంటూ కేకలు పెడుతూ ఇళ్లకు చేరారు. ఐదు రోజులపాటు రణక్షేత్రంలో జరిగిన పల్నాటి వీరారాధన ఉత్సవాలు ముగిశాయి. పల్నాటి వీరాచారవంతులకు వారి ఆయుధాలకు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు.
పల్నాటి వీరులకు ఘనంగా
వీడ్కోలు పలికిన ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment