చిలకలూరిపేట రూరల్ మండలంలో జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన చర్యలు (ఫైల్ )
సాక్షి, నరసరావుపేట : పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదాల కట్టడికి పోలీసుశాఖ ‘స్పాట్’ పెట్టింది. ఎక్కువగా జరుగుతున్న రహదారులు, ప్రాంతాలు గుర్తించి, నివారణకు హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణలు, రేడియం స్టిక్కర్లు, జీబ్రా క్రాసింగ్‌లు, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేసింది. తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్‌రెడ్డి పర్యటించి, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రహదారి భద్రతపై వాహనదారులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. రహదారుల్లో ప్రమాదకర మలుపులు, జంక్షన్ల వద్ద పోలీసుల్ని కాపలా ఉంచి వాహనాల్ని నియంత్రిస్తున్నారు. ప్రమాదాల సంకేతాలను చూపిస్తూ సైన్ బోర్డులు పెట్టారు. రహదారుల మలుపుల వద్ద రేడియం స్టిక్కర్స్, సోలార్ బ్లింకర్స్ ఏర్పాటు చేసి వాహనదారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా చేపట్టిన చర్యల వల్ల మంచి ఫలితాలు కనిపిస్తునట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. గత రెండేళ్లతో పోల్చితే 2023లో రోడ్డు ప్రమాదాలు, మరణాలు, గాయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది మరింత తగ్గేలా పని చేస్తున్నామని చెబుతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యం, డ్రైవర్లు మద్యం తాగడంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
97 స్పాట్లు గుర్తింపు
జిల్లాలో గత రెండు సంవత్సరాలలో రెండు లేక అంతకన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రదేశాలు 97 ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రదేశాలలో పోలీస్, రవాణా, నేషనల్ హైవేస్, ఆర్ అండ్ బీ శాఖలు సంయుక్త సర్వే నిర్వహించాయి. ప్రమాదాలు జరగడానికి గల కారణాల్ని అధికారులు విశ్లేషించారు. ఎక్కువగా రోడ్డు జంక్షన్ల వద్ద జరుగుతున్నట్టు గుర్తించినట్లు జిల్లా రవాణాశాఖ అధికారి టి.కె. పరంధామరెడ్డి తెలిపారు.
ప్రమాదాలకు కారణమైన జంక్షన్ల గుర్తింపు
జంక్షన్ల వద్ద వాహనదారుల వేగాన్ని నియంత్రించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణం. ఎన్‌హెచ్–16 పై గణపవరం – తిమ్మాపురం మధ్య, నార్క్‌ట్‌పల్లి– అద్దంకి హైవేలో పొందుగుల, గురజాల రోడ్డు జంక్షన్, గుంటూరు–పిడుగురాళ్ల రహదారిలో కంటిపూడి, పిడుగురాళ్ల మండలం కామేపల్లి, ముప్పాళ్ల, గుంటూరు–శ్రీశైలం రోడ్డులో అందుగలపాడు, రావిపాడు గ్రామాల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ఇవి కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆ సమయంలో 41 శాతం ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
నివారణకు చర్యలు తీసుకుంటున్న పోలీస్, రవాణా శాఖలు 2023లో 567 ప్రమాదాల్లో 388 మంది మృతి, 472 మందికి గాయాలు అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తు కారణం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు ఎక్కువగా ప్రమాదాలు 2022తో పోల్చితే 2023లో 22.6 శాతం తగ్గాయి
ప్రమాదాల సంఖ్య తగ్గించాం
రోడ్డు ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. అవి ప్రదేశాలు, సమయం, కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై శాసీ్త్రయంగా అధ్యయనం చేసి, చర్యలు చేపడుతున్నాం. పోలీసు శాఖ చేపట్టిన చర్యలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. 2022లో పోల్చితే 2023లో ప్రమాదాలు 22.6 శాతం, గాయాలు 29 శాతం, మరణాలు 5 శాతం తగ్గాయి. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గించేలా పోలీసు శాఖ పని చేస్తోంది. అతి వేగం, మద్యం సేవించడం, జంక్షన్ల వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో అధికంగా సంభవిస్తున్నాయి.
– వై. రవిశంకర్‌రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ
గత మూడేళ్లలో ప్రమాదాల వివరాలు
సంవత్సరం ప్రమాదాలు మరణాలు గాయాలు
2021 793 445 739
2022 733 407 663
2023 567 388 472
రహదారుల మీద ప్రమాదాలు ఇలా...
సంవత్సరం జాతీయ రాష్ట్ర అంతర్గత
రహదారులు రహదారులు రహదారులు
2021 211 368 214
2022 214 260 259
2023 138 210 219
Comments
Please login to add a commentAdd a comment