కవి కాసలకు సాహిత్య పురస్కారం ప్రదానం
అద్దంకి: పద్యం, గేయం, వచనంపై మంచి పట్టు కలిగిన కవి కాసన నాగభూషణం అని.. ఆయన సాహిత్యం సంఘ హితమని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. పుట్టంరాజు బుల్లెయ్య రామలక్ష్మమ్మల విశిష్ట సాహిత్య పురస్కార సభను ఇందిరానగర్‌లోని పుట్టంరాజు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఈసభకు సాహితీ కౌముది అధ్యక్షుడు, ట్రస్టు అధ్యక్షుడు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా పుట్టంరాజు మాట్లాడుతూ కాసల నాగభూషణం ఆముక్తమాల్యదకు సరళ వచనానువాదం చేసి ప్రముఖుల ప్రశంసలందుకొన్నారని చెప్పారు. అనేక పత్రికల్లో వీరి కవితలు, కథలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయని తెలిపారు. కాసల బహుముఖ ప్రజ్ఞావంతులని పేర్కొన్నారు. పద్యకవి డీవీఎం సత్యనారాయణ మాట్లాడుడూ కాసల వచన రూపం ఇచ్చిన ఆముక్తమాల్యద కావ్యంలోని విశేషాలు నేటితరం ఆకళింపు చేసుకోవడానికి వీలుగా ఉన్నాయని తెలిపారు. ఈ గ్రంథాన్ని కన్నడ భాషలోకి అనువదించడం వలన తెలుగుభాష గొప్పదనం మరింతగా ఇనుమడించిందని తెలిపారు. ఇలపావులూరి శేష శ్రీధరశర్మ మాట్లాడుతూ కాసల రాసిన తిక్కన సీత–తులనాత్మక పరిశీలన అనే గ్రంథం ఆయన రచనా వైవిధ్యాన్ని తెలుపుతుందని పేర్కొన్నారు. వారణాసి రఘురామశర్మ మాట్లాడుతూ కాసల రచించిన నవీన సుమతీశతకం సాహితీ ప్రముఖుల ఆదరణ పొందిందని తెలిపారు. అనంతరం పుట్టంరాజు బుల్లెయ్య రామలక్ష్మమ్మల విశిష్ట సాహిత్య పురస్కారాన్ని పుట్టంరాజు శ్రీరామ చంద్రమూర్తి, శైలజలు కాసలకు అందించారు. కార్యక్రమంలో చప్పిడి వీరయ్య, డాక్టర్ యు.దేవపాలన, గాడేపల్లి దివాకరదత్తు, నారాయణం బాల సుబ్రహ్మణ్యం, గాడేపల్లి దివాకరదత్తు, అద్దంకి నాగేశ్వరరావు, ఓరుగంటి శ్రీనివాసరావు, ఊటుకూరి రామకోటేశ్వరరావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, లక్కరాజు శ్రీనివాసరావు, అన్నమనేని వెంకటరావు కంభంపాటి రామమోహనరావు, ఆర్వీ రాఘవరావు, బాలు, మహమ్మద్ రఫీ, అంగలకుర్తి ప్రసాద్, కొండకావూరి కుమార్, కోటయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment