ఆటలతో ఉద్యోగుల పనితీరు మెరుగు
గుంటూరు రూరల్: ఆటలతో ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మెరుగు పడుతుందని విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ వై. వెంకటేశ్వరరావు అన్నారు. రెండు రోజులుగా పెదపలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ కళాశాలలో జరుగుతున్న ఈపీఎఫ్‌వో సౌత్‌జోన్ కబడ్డీ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ఈ వేడుకల్లో అతిథిగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి పోటీలు తరచూ నిర్వహించడం వల్ల వారిలో ఉత్సాహం పెరుగుతుందని చెప్పారు. అధ్యక్షత వహించిన గుంటూరు ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ 2 ఇంద్రనీల్ ఘోష్ మాట్లాడుతూ... క్రీడలు ఉద్యోగుల శారీరక దారుఢ్యం, మానసిక వికాసానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. సహాయక కమిషనరు మాధవశంకర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఐక్యంగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. పోటీల్లో పాల్గొన్న 4 రాష్ట్రాల క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఉద్యోగులు ఎం. రామశేషు, రాకేష్‌లు పలు గీతాలు ఆలపించారు. కర్ణాటక జట్టుకు విన్నర్, తమిళనాడు జుట్టుకు రన్నర్ ట్రోఫీని బహూకరించారు. క్రీడాకారులను మెమెంటో, సర్టిఫికెట్‌లతో సత్కరించారు. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు మెంబర్ రవికుమార్ మాట్లాడుతూ క్రీడల నిర్వహణ తీరు బాగుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఇలియాస్‌ఖాన్, రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్ బాబు, కె. సుధాకరరావు, గంగాకృష్ణకాంత్, కె. సాయిధర్, ఎ. ప్రభాకర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment