వినుకొండలో జన ప్రవాహం | Sakshi
Sakshi News home page

వినుకొండలో జన ప్రవాహం

Published Tue, Apr 23 2024 8:25 AM

క్రేన్‌ల సాయంతో బొల్లాకు స్వాగతమాలలు
 - Sakshi

వినుకొండ(నూజెండ్ల): వినుకొండకు జన ప్రవాహం తరలివచ్చింది. వినుకొండ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్‌ సందర్భంగా 50 వేల మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లు కిక్కిరిసిపోయాయి. బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్‌ యర్రం వెంకటేశ్వరరెడ్డి, యువ నాయకుడు గిరిబాబులతో కలసి సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి వరదా సుబ్బారావుకు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. తొలుత గుంటి ఆంజనేయస్వామి దేవాలయం, పెద్దమసీదు, ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్ట్‌ చర్చిలో సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం కారంపూడి రోడ్డులోని బొల్లా కన్వెన్షన్‌ హాల్‌ వద్ద నుంచి కుటుంబసభ్యులు బొల్లా ఆదిలక్ష్మి, గిరిబాబులతో కలిసి ర్యాలీగా బయలుదేరి నామినేషన్‌ దాఖలు చేశారు.

భారీ ర్యాలీ

బొల్లా కన్వెన్షన్‌ హాల్‌ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. కర్ణాటక కళాకారుల ప్రత్యేక నృత్యాలు, డీజే సౌండ్‌ల హోరు మధ్య ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈపూరు, బొల్లాపల్లి, శావల్యాపురం, నూజెండ్ల, వినుకొండ రూరల్‌, వినుకొండ టౌన్‌ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం విశేషం. రహదారి పొడవున బిల్డింగ్‌లపై నుంచి ప్రజలు అభివాదం చేస్తూ ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ప్రధాన సెంటర్లలో మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి శుభాకాంక్షలు తెలియజేశారు. ర్యాలీ శివయ్య స్థూపం సెంటర్‌ వద్దకు రాగానే నాలుగువైపులా రహదారులు ఇసుకేస్తే రాలనంతగా జనం ఎండను సైతం లెక్క చేయకుండా మధ్యాహ్న సమయంలో కూడా కిక్కిరిసిపోయారు. శివయ్య స్థూపం సెంటర్‌లో 10 భారీ క్రేన్‌లతో భారీ గజమాలలు ఎమ్మెల్యేకు వేసి అభిమానులు ప్రత్యేక అభిమానం చాటుకున్నారు.

కార్యకర్తల త్యాగాలను మరువలేను

ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కార్యకర్తలు చూపిన అభిమానం, ఆదరణ, వారి త్యాగాలను మరువలేనిదన్నారు. మండుటెండలో సైతం తనపై ప్రేమ, అభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని, టీడీపీ నాయకులు బెదిరింపులకు భయపడమని అన్నారు. కార్యకర్తల కష్టం ఊరికే పోదని, మరలా మనమే అధికారంలోకి వస్తామని అన్నారు. వినుకొండ అభివృద్ధికి టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారని అన్నారు. లక్ష మంది ప్రజలకు తాగునీరు ఇవ్వాలని నేను సంకల్పిస్తే, సింగరచెరువుకు నీరు రాకుండా అడ్డుకోవడం టీడీపీ వారికే చెల్లిందని అన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టు తమ హయాంలోనే పూర్తిచేస్తామన్నారు. టీడీపీ నాయకులు గ్రామాల్లో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని, ఎవరూ భయపడవద్దని తమ ప్రాణాలైనా అడ్డువేసి కాపాడతానని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహాయసహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి బొల్లా నామినేషన్‌

1/1

Advertisement
Advertisement