త్రికోటేశ్వరుడికి రూ.49,93,142 ఆదాయం
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం హుండీల ద్వారా రూ.49,93,142 ఆదాయం లభించినట్టు ఈవో దాసరి చంద్రశేఖర్ తెలిపారు. ఆలయ హుండీల లెక్కింపు బుధవారం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. 104రోజులకు హుండీల ద్వారా రూ.45,40,704, అన్నదాన హుండీ ద్వారా రూ.4,52,438 ఆదాయం లభించినట్టు వివరించారు. హుండీ లెక్కింపులో భక్త సమాజం ప్రతినిధులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
పిల్లేరు వాగులోకి
దూసుకెళ్లిన టిప్పర్
మాచవరం: మండలంలోని నాగేశ్వరపురం తండా సమీపంలోని పిల్లేరు వాగులోకి టిప్పర్ దూసుకెళ్లిన ఘటన బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నాలుగు రోజులుగా చప్టాపై నీరు పారుదల ఆగిపోయింది. ఈ మార్గాన ఇసుక లారీలు, ట్రిప్పర్లు, ఇతర వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. నాగేశ్వరపురం వైపు నుంచి బెల్లంకొండ మండలానికి వెళుతున్న టిప్పర్ మూల మలుపు వద్ద అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
పిడుగుపాటుకు రైతు మృతి
అంబడిపూడి( క్రోసూరు): అచ్చంపేట మండలంలోని అంబడిపూడిలో బుధవారం పిడుగుపాటుకు గురై రైతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రైతు కూనిసెట్టి నారాయణ(35) పత్తి పొలంలో పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా, సమీపంలో పిడుగు పడి మృతి చెందాడు. పక్క పొలంలోని కూలీలు చూసి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. మృతుడికి భార్య , ఇద్దరు సంతానం ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
నేలకొరిగిన భారీ వృక్షం
సత్తెనపల్లి: గాలి, వర్షం కారణంగా బుధవారం సబ్ రిజిస్టార్ కార్యాలయ ఆవరణలోని భారీ చింత చెట్టు కూలింది. పెద్ద పెద్ద కొమ్మలు కార్యాలయ ప్రహరీ గోడ మీద నుంచి రోడ్డుపై పడటంతో ట్రాఫిక్ స్తంభించింది. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. గోడను ఆనుకుని ఉన్న టీ, స్టాంప్‌ల విక్రయ దుకాణంతో పాటు ద్విచక్ర వాహనంపై కూడా కొమ్మలు పడటంతో అవి ధ్వంసం అయ్యాయి. నిత్యం స్టాంపు వెండర్లు, భూముల కొనుగోలు, అమ్మకందారులు, కోర్టుకు వచ్చే కక్షిదారులతో సబ్ రిజిస్టార్ కార్యాలయ ఆవరణలో జనసంచారం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పట్టణ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని చింతచెట్టు కొమ్మలను తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.
మిర్చి యార్డు పర్సన్ ఇన్‌చార్జిగా భార్గవ్ తేజ బాధ్యతల స్వీకరణ
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డు పర్సన్ ఇన్‌చార్జిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా యార్డు ఆవరణలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యార్డులో పర్యటించారు. క్రయవిక్రయాల తీరు, ప్రస్తుతం మిర్చి ధరలు, బిడ్డింగ్ విధానం, రైతులకు గిట్టుబాటు ధర లభ్యత తదితరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. మిర్చి కమీషన్ షాపులు, రైతు విశ్రాంతి భవనం, ఉచిత భోజన శాల, ఇతర వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా భార్గవ్ తేజ మాట్లాడుతూ.. రాబోవు మిర్చి సీజన్ నాటికి యార్డులో పెండింగ్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment