పండగను ఆనందంగా జరుపుకోవాలి
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
నరసరావుపేట: జిల్లా ప్రజలందరూ కుటుంబ సమేతంగా దీపావళిని ఆనందంగా నిర్వహించుకోవాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా జిల్లాలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా తీసుకున్న ముందస్తు చర్యలు, ప్రజలు పాటించాల్సిన నిబంధనల గురించి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాణసంచా తయారీ కేంద్రాలు, నిల్వ చేసే గోడౌన్‌లు, దుకాణాలకు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి ఉండాలని తెలిపారు. నిబంధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో అనధికారంగా బాణసంచా తయారీ, విక్రయాలు, నిల్వలు చేపట్టే వారిని గుర్తించి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు వద్ద బైండోవరు చేస్తామనిని తెలిపారు. దుకాణాలు నివాస ప్రాంతాలకు నిర్దిష్ట దూరంలో ఉండాలని, అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. ప్రతి దుకాణం వద్ద రెండు అగ్ని నిరోధక సిలెండర్లు, రెండు బకెట్ల పొడి ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలని ఆయన తెలిపారు. పోలీస్ అధికారులు వారి పరిధిలోని బాణసంచా తయారీ కేంద్రాలు, దుకాణాలు, నిల్వ ఉంచిన గోడౌన్‌లను సందర్శించి లైసెన్స్‌లు తనిఖీ చేయాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా బాణసంచా అక్రమ విక్రయాలు, నిల్వలకు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు 100, 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment