కార్తిక మాసోత్సవాలకు అమరేశ్వరాలయం ముస్తాబు
అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయం కార్తిక మాసోత్సవాలకు ముస్తాబవుతోంది. సామాన్య భక్తులతో పాటు పంచారామ యాత్రికులకు స్వామి దర్శనం త్వరితగతిన జరిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో సునీల్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన దేవాలయంలో చేసిన ప్రత్యేక ఏర్పాట్ల గురించి వివరించారు. నవంబరు 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కార్తిక మాసంలో భక్తులకు వసతి, ఉచిత దర్శనం, ప్రసాదం, పరిమిత స్థాయిలో అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్నాన ఘట్టాలలో తాత్కాలిక మరుగుదొడ్లు, సీ్త్రలు దుస్తులు మార్చుకునే గదులు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. పారిశుద్ధ్య సిబ్బందిని పెంచి ఆలయ పరిశుభ్రంగా ఉంచుతామని చెప్పారు.
ప్రతి సోమవారం ప్రత్యేక అభిషేకాలు
ఆలయంలో పంచారామాలను సందర్శించే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో సునీల్‌కుమార్ తెలిపారు. స్వామి దర్శనం, ప్రసాదం అందించడం తదితర కార్యక్రమాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. స్నాన ఘాట్ల వద్ద పంచారామాల బస్సులు నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుండటంతో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా వాటిని నిలిపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆదివారం, సోమవారాల్లో తెల్లవారుజామున 3గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. సాయంత్రం 4గంటల వరకు అమరేశ్వరునికి అభిషేకాలు నిర్వహిస్తామని, రాత్రి 10 గంటల వరకు ఆలయాన్ని తెరచి ఉంచుతామని వివరించారు. భక్తుల పరోక్షంలో కార్తిక మాస నిత్యాభిషేక పథకం ద్వారా అమరేశ్వరస్వామికి అభిషేకాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి సోమవారం అమరేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలను సాయంత్రం 4గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించారు. బాలచాముండేశ్వరీ అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహిస్తామని తెలిపారు. కార్తిక పౌర్ణమి నాడు కృష్ణానదిలో స్వామికి తెప్పోత్సవం, అనంతరం జ్వాలామాలికా దీపోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్తిక మాసం నెలరోజుల పాటు దేవాలయ పరిసర ప్రాంతాలలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం వందమంది పోలీసులు విధులు నిర్వహిస్తారని ఈవో వెల్లడించారు.
పంచారామ భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు
త్వరితగతిన దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment