వేళాయె
కార్తిక పూజలకు
పెదకాకాని శివాలయంలో ఏర్పాట్లు
పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో కార్తిక మాసానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయ అధికారి, ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్తిక మాసం శుద్ధ పాఢ్యమి నవంబర్ 2 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు రానుంది. ఆలయంలో కార్తిక మాసం సందర్భంగా నిత్యం ఉదయం మహన్యాస పూర్వక రుద్ర జప, రుద్రహోమం, ఏకాదశ రుద్రాభిషేక పూజలు నిర్వహించనున్నారు. పరోక్ష అభిషేక పథకాన్ని కూడా అధికారుల ప్రవేశపెట్టారు. రూ. 2,000 చెల్లించిన వారికి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపించనున్నారు. నవంబర్ 26న భక్తులతో సామూహిక లక్ష బిల్వార్చన ఉంటుంది. నవంబరు 29న మాస శివరాత్రి రోజు పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పూజలు జరిపించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్‌లను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసు, అగ్నిమాపక, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల సిబ్బంది సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. కార్తిక పౌర్ణమి నాడు కోటి దీపోత్సవం ఉంటుందని చెప్పారు. పర్వదినాల్లో ప్రత్యేక పూల అలంకారం, విద్యుద్దీపాల అలంకరణ ఉంటుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment