రైతుల పెడబొబ్బర!
నేను 10 ఎకరాల్లో మిర్చి పంట సాగుచేశా. బొబ్బర తెగులు సోకి పంట దిగుబడి బాగా తగ్గింది. మరోవైపు ధర అమాంతం పడిపోవడంతో దిక్కుతోచడం లేదు. గత సీజన్‌లో పండిన 250 క్వింటాళ్ల మిర్చిని అధిక ధర వస్తుందని కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరిచా. అప్పట్లో తేజా రకం ధర రూ.18 వేలు ఉండగా ఇప్పుడు అది రూ.14వేలకు పడిపోయింది. ఇన్ని రోజులు దాచిన తరువాత ఉన్న ధర రూ.4వేల నుంచి రూ.6 వేలు పడిపోతే ఎంత నష్టమో అర్థం చేసు కోండి. మిర్చి రైతులు సంక్షోభంలో ఉన్నారు.
– కామిరెడ్డి లింగారెడ్డి, మండాది, వెల్దుర్తి మండలం
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు సుంకర వెంకటేశ్వర్లు, ఊరు వెల్దుర్తి మండలం మండాది. ఎనిమిది ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. సుమారు రూ.11 లక్షలు ఖర్చు చేశాడు. పూత దశ దాటాక బొబ్బర తెగులు సోకడంతో ఆకులు ముడుచుకుపోయి పూత, పిందె రాలిపోయాయి. దిగుబడి బాగా తగ్గిపోయింది. వచ్చిన అరకొర మిర్చి దిగుబడిని కూలీలతో తీసి అమ్ముదామంటే మార్కెట్‌లో ధర అమాంతరం పడిపోయింది. కూలీల ఖర్చులకూ సరిపోని దుస్థితి. ఎకరానికి రూ.1.4 లక్షల చొప్పున పెట్టిన పెట్టుబడి మొత్తం పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
– ఇలా వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి, గురజాల మండలాల్లో అనేక మంది రైతులు బొబ్బర తెగులుతో నష్టపోయి విలవిల్లాడుతున్నారు.
● మిరప రైతును ముంచిన తెగులు
● పూత దశలో విజృంభించిన బొబ్బర తెగులు
● భారీగా తగ్గిన దిగుబడి
● మందులు వాడినా ఫలితం శూన్యం
● ఎకరాకు రూ.లక్షపైనే నష్టం
● దిగజారిన ధరలతో మరిన్ని అవస్థలు
● పల్నాడు జిల్లాలో ఖరీఫ్‌లో 39,609 హెక్టార్లలో సాగు
నేను ఆరు ఎకరాల్లో మిర్చి పంట సాగుచేశా. బొబ్బర తెగులు వల్ల పంట తీవ్రంగా దెబ్బతింది. కనీస దిగుబడి వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఎకరాకు రూ.లక్షకుపైగా పెట్టుబడి పెట్టాం. దీంతో ఈ ఏడాది తీవ్రంగా నష్టపోనున్నాం.
– వెన్నపూసల జగన్‌మోహన్‌రెడ్డి, కాచవరం, కారంపూడి మండలం
సాక్షి, నరసరావుపేట: మిర్చి రైతు పాలిట బొబ్బర తెగులు మహమ్మారిలా దాపురించింది. రూ.లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన పంట కళ్లముందే రోజురోజుకు క్షీణించడంతో కర్షకులు దిగాలు పడుతున్నారు. మబ్బులతో కూడిన చల్లని వాతావరణం ఉండటంతో మిర్చికి పురుగు, తెగుళ్ల బెడద అధికమైందని రైతులు భావిస్తున్నారు. పంట దిగుబడి భారీగా పడిపోతోందని చెబుతున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో మిర్చి ధరలు భారీగా పతనమైన సమయంలో దిగుబడి పడిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇదిలా ఉంటే బొబ్బర తెగులుకు క్రాప్ ఇన్సూరెన్సు వర్తించే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ ఖరీఫ్‌లో పల్నాడు జిల్లాలోని రైతులు 36,609 హెక్టార్లలో మిర్చి పంటను సాగు చేశారు.
పూత పిందె రావడం లేదు..
మిర్చి పంటకు మిగిలిన పంటలతో పోలిస్తే పెట్టుబడి ఎక్కువ. దిగుబడి, ధర బాగుంటే అధిక లాభాలు వస్తాయన్న ఆశతో రైతులు అప్పులు చేసి మరీ ఖర్చు చేస్తారు. ఎరువులు, పురుగుమందుల వాడకం ఎక్కువ కావడంతో ప్రస్తుతం ఎకరా మిర్చి పంటకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు పెట్టుబడి అవుతోంది. కౌలు రైతులైతే భూమి కౌలుకు మరో రూ.20వేల నుంచి రూ.30 వేలు అధికంగా వెచ్చిస్తారు. ఇంతమొత్తం పెట్టుబడి పెట్టి సాగు చేస్తే తీరా పంట చేతికొచ్చే సమయంలో బొబ్బర తెగులు పంటను తుడిచిపెట్టేస్తోంది. ఆకులు మడతపడిపోతున్నాయి. మొక్క ఎదుగుదల ఆగిపోయింది. ఇప్పటికే ఉన్న పూత, పిందెలు అర్ధతరంగా రాలిపోతున్నాయి. మిర్చి సాధారణ దిగుబడి 30 క్వింటాళ్ల వరకు ఉండగా బొబ్బర వచ్చిన తోటల్లో ప్రస్తుతం 10 క్వింటాళ్లు కూడా రావడం కష్టమని రైతులు చెబుతున్నారు. గతంలో మిర్చి ధర క్వింటాలుకు రూ.20 వేలకుపైగా ఉండగా ప్రస్తుతం రూ.14 వేలు మాత్రమే పలుకుతోంది. దీంతో పండిన అరకొర మిర్చిని కూలీలతో తీసి విక్రయిస్తే కనీసం కూలీ, రవాణా ఖర్చులూ రావని రైతులు ఆక్రోశిస్తున్నారు. దీంతో కొంతమంది పంటను అలాగే వదిలేస్తున్నారు.
సంక్షోభంలో మిర్చి రైతులు
రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టా
Comments
Please login to add a commentAdd a comment