నిబంధనలకు ‘నీళ్లు’
నరసరావుపేట: సాగునీటి సంఘాల్లో భాగమైన డిస్ట్రిబ్యూటరీ కమిటీ(డీసీ)ల ఎన్నికలు మంగళవారం ఏకపక్షంగా జరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను చాలా చోట్ల టీడీపీ, జనసేన నాయకులు పంచుకున్నారు. ఎన్నికల నిబంధనలకు నీళ్లొదిలారు. ఎమ్మెల్యేలు సూచించిన వారికే పదవులు లభించాయి. నియోజకవర్గ కేంద్రాల్లోనే పోలింగ్ నిర్వహించారు. గత శనివారం జరిగిన వాటర్ యూజర్ అసోసియేషన్(డబ్ల్యూయూఏ) ఎన్నికలతోనే మొత్తం ఎన్నికల ప్రక్రియను అధికార కూటమి ప్రభుత్వం అపహాస్యం చేసిందనే విషయం తేటతెల్లమైంది. ప్రతిపక్షాలకు ఓటరు జాబితాలు ఇవ్వకపోవటం, కనీసం ఎన్నిక జరుగుతున్న గ్రామాల్లోని ప్రజలకూ ఎన్నికలు ఉన్నాయనే విషయం తెలియకుండా నిర్వహించడం విస్తుగొలిపింది. ముందుగానే నిర్ణయించుకున్న పేర్లను అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా టెరిటోరియల్ క్యాండిడేట్లు(టీసీ)గా ఎన్నికైన వారు ఎన్నుకున్నారు. డబ్ల్యూయూఏ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా జనసేనకు ప్రాతినిథ్యం కల్పించలేదనే విమర్శలు వెల్లువెత్తడంతో పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి డీసీ అధ్యక్ష పదవిని కమ్మ సామాజికవర్గానికి, ఉపాధ్యక్ష పదవిని కాపు సామాజికవర్గానికి కట్టబెట్టారు. నరసరావుపేట నియోజకవర్గంలో రెండు డీసీల వైస్ చైర్మన్ పదవులను జనసేనకు కేటాయించారు. నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలో 32 డీసీలు ఉండగా, గుంటూరు జిల్లాలో ఐదు, ప్రకాశం జిల్లాలో రెండు ఉన్నాయి. వీటిలో పల్నాడు జిల్లాలో ఉన్న 25 డీసీలైన మాచర్ల, గురజాల, కారంపూడి, చామర్రు, నకరికల్లు, ముప్పాళ్ల, సత్తెనపల్లి, తంగెడ, బెల్లంకొండ, క్రోసూరు, కేసానుపల్లి, పిడుగురాళ్ల, పెదకూరపాడు, అమరావతి, ఫిరంగిపురం, లింగంగుంట్ల, చిలకలూరిపేట1, 2, రొంపిచర్ల, గంటావారిపాలెం, వినుకొండ, చీకటీగెలవారిపాలెం, ఐనవోలు, త్రిపురాపురం, ములకలూరుకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా నోడల్ అధికారి, ఎన్‌ఎస్పీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ మురళీధర్ పేర్కొన్నారు. జిల్లాలో 219 మేజర్, 55 మైనర్ కలిపి మొత్తం 274 సాగునీటి ఎన్నికలకు గత బుధవారం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే
ఏకపక్షంగా డీసీ ఎన్నికలు తూతూమంత్రంగా ప్రక్రియ టీడీపీ ఎమ్మెల్యేలదే నిర్ణయాధికారం అక్కడక్కడ జనసేనకు ప్రాతినిధ్యం
Comments
Please login to add a commentAdd a comment