మెరుగైన పోలీసింగ్‌తో నేరాలు తగ్గుదల | - | Sakshi
Sakshi News home page

మెరుగైన పోలీసింగ్‌తో నేరాలు తగ్గుదల

Published Wed, Jan 1 2025 2:03 AM | Last Updated on Wed, Jan 1 2025 2:04 AM

మెరుగైన పోలీసింగ్‌తో నేరాలు తగ్గుదల

మెరుగైన పోలీసింగ్‌తో నేరాలు తగ్గుదల

నరసరావుపేట: పోలీస్‌ శాఖలో సమర్థమైన సిబ్బంది పనితీరు, మెరుగైన పోలీసింగ్‌తో గతంతో పోల్చితే ఈ ఏడాది నేరాలు తగ్గాయని జిల్ల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వార్షిక వివరాలను వెల్లడిస్తూ మాట్లాడారు. 2022లో మొత్తం 4712 కేసులు, 2023లో 4578 నమోదుకాగా, 2024లో 4,222కేసులు నమోదయ్యాయని అన్నారు. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 2023లో 133, 2024లో 356 కేసులు తగ్గాయని చెప్పారు. గత ఏడాదితో పోల్చితే నివేదించబడిన కేసులలో 7.7శాతం తగ్గుదల కన్పిస్తుందన్నారు. పోలీసింగ్‌లో విన్నూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. రెట్టింపు ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్‌ను అందిస్తామని ఎస్పీ వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు పడ్డాయన్నారు. ఈ ఏడాది పల్నాడు జిల్లాలో 661 కేసులలో నిందితులకు శిక్షలు ఖరారు అయ్యాయన్నారు. హత్య కేసులు 2022లో 37 జరగ్గా, 2023లో 40 కేసులు, 2024లో 44 కేసులు నమోదై 10శాతం పెరుగుదల కన్పిస్తుందన్నారు. నాలుగు కేసుల్లో జీవిత ఖైదు కోర్టుల విధించాయన్నారు. ప్రాపర్టీ కేసులు 2022లో 603, 2023లో 344, 2024లో 520 కేసు లు నమోదయ్యాయని చెప్పారు. ఈ ఏడాది 55 శాతం ప్రాపర్టీ రికవరీ చేశామన్నారు. రోడ్డు ప్రమా దాల నియంత్రణకు తీసుకున్న చర్యలతో రోడ్డుప్రమాదాలు తగ్గాయన్నారు. ప్రతినెలా ప్రమాదలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, స్టాప్‌ బోర్డులు ఏర్పాటు, నిరంతర వాహనాల తనిఖీలు, డ్రంకెన్‌ డ్రైవ్‌, ప్రత్యేక అవగాహన సదస్సులు, ట్రాఫిక్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ పెద్ద ఎత్తున పెంచడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించామన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు 2022లో 86, 2023లో 106, 2024లో 236 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మహిళలపై నేరాలు పరిశీలిస్తే 2022లో 713, 2023 274, 2024లో 502 కేసులు నమోదయ్యాయని, 2023 నుండి 2024 మధ్య 230 కేసులు పెరిగాయని ఎస్పీ పేర్కొన్నారు. పోక్సో చట్టం కేసులు 2022, 81, 2023 29, 2023లో 50 కేసులు నమోదయ్యాయని, 2023తో పోల్చితే 21 పెరిగాయని చెప్పారు. మహిళలు, చిన్న పిల్లలపై నేరాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. డీఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారుల స్వీయ పర్యవేక్షణలో కేసు యొక్క విచారణ సమయాన్ని ఘణనీయంగా తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరానికి పాల్పడిన వారికి జీవిత ఖైదు అంతకంటే ఎక్కువ శిక్షలు పడేవిధంగా చేశామన్నారు. ఈఏడాది ఆరు కేసులలో నిందితులకు జీవిత ఖైదు పడిందన్నారు. సైబర్‌ క్రైమ్‌, ఐటీ చట్టం కేసులు 2022లో 27, 2023లో 20 కేసులు, 2024లో 60 కేసులు నమోదయ్యాయని చెప్పారు. పల్నాడు జిల్లాలో గతంలో ఫ్యాక్షన్‌ ఎక్కువగా ఉండే గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు నిరంతరం నిఘా వుంచి ప్రత్యేక పోలీసు బృందాలను నియమించామని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాలు, తండాలు, నల్లమల్ల అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తూ తయారీదారులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా ఫుట్‌ పెట్రోలింగ్‌, పెట్రోలింగ్‌, బీట్స్‌ సంఖ్యను పెంచామని చెప్పారు. మీతో మేము ప్రోగ్రాం జిల్లాలోని ప్రతి పోలీస్‌ స్టేషన్లో డిజిటల్‌ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ, నిఘాలో భాగంగా డిజిటల్‌ బారికేడ్లు, మూడు అధునాతన గస్తీ ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టామన్నారు. ఏపీ ఫైబర్‌నెట్‌ ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల వలన పోలీసు విభాగానికి ఏదైనా ప్రయోజనం ఉందా అని సాక్షి ప్రశ్నించగా, కొన్నిచోట్ల ఆ కెమెరాలను వినియోగించుకుంటున్నామని ఎస్పీ చెప్పారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలనా విభాగ అదనపు ఎస్పీ జేవీ సంతోష్‌, ఏఆర్‌ అదనపు ఎస్పి సత్తిరాజు, డీఎస్పీలు కె.హనుమంతరావు, జగదీష్‌ పాల్గొన్నారు.

జిల్లాలో 661కేసుల్లో శిక్షలు

హత్యలు పది శాతం పెరుగుదల

55 శాతం ప్రాపర్టీ రికవరీ

ఇంకా రోడ్డు ప్రమాదాలు,

నేరాలు తగ్గేందుకు కృషి చేస్తాం

వార్షిక నివేదిక వెల్లడించిన జిల్లా ఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement