దొంగ జంట మోసం
● పరిచయం పెంచుకుని దొంగతనాలు ● అచ్యుతాపురంలో రూ.3.60 లక్షల తస్కరణ ● గతంలో పిఠాపురం, చోడవరంలోనూ చోరీలు ● ఇద్దరూ పల్నాడు జిల్లాకు చెందిన వారే.. ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ సత్యనారాయణ
అచ్యుతాపురం: బంగారు వస్తువును చూపించి నమ్మబలికి వాణిజ్యదుకాణదారులను బురిడీ కొట్టిస్తున్న పల్నాడు జంట పోలీసులకు చిక్కింది. ఈ జంటను అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు సేకరించిన సమాచారం, డీఎస్పీ సత్యనారాయణ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాకు చెందిన యు.సత్యనారాయణ, కల్యాణి భార్యాభర్తలమని చెప్పి అచ్యుతాపురంలోని ఒక దుకాణం నిర్వాహకులతో పరిచయం పెంచుకున్నారు. గత నెలలో ఒకసారి వచ్చి బంగారం బిస్కట్ లాంటి వస్తువును ఇచ్చి అమ్మి పెట్టాలని, తమ కుటుంబంలో వారి పెళ్లికి దుస్తులు కొనాలని చెప్పి వెళ్లిపోయారు. కొద్ది రోజుల తర్వాత (డిసెంబర్ 18న) దుకాణం వద్దకు వచ్చిన భార్య నిర్వాహకులను మాటల్లో పెట్టి దుస్తులు చూస్తుండగా, భర్త దుకాణంలోని రూ.2.80 లక్షలను చాకచక్యంగా తస్కరించాడు. భార్య కూడా మరో రూ.80 వేలు చోరీ చేసింది. వారిద్దరూ అక్కడి నుంచి చల్లగా జారుకున్న తర్వాత మోసపోయామని గుర్తించిన యజమాని అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ గణేష్, ఎస్‌ఐ సుధాకర్, సిబ్బంది మల్లేశ్వరరావు, బంగారయ్య గురువారం అచ్యుతాపురంలో అనుమానంగా సంచిరిస్తున్న నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సొమ్మును, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పల్నాడుకు చెందిన వీరిద్దరూ భార్యాభర్తలు కాదని గుర్తించారు. గతంలో వీరు పిఠాపురం, చోడవరం ప్రాంతాల్లో చోరీ చేసి, అచ్యుతాపురంలోనూ తతంగం పూర్తి చేశారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.
Comments
Please login to add a commentAdd a comment