కులాల మధ్య చిచ్చు పెడితే సహించం
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌పాల్
శావల్యాపురం: సమగ్ర దర్యాప్తు నివేదిక రాకుండానే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడటం కులాల మధ్య చిచ్చుపెట్టటమేనని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టరు గోదా జాన్‌పాల్ పేర్కొన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఒక ప్రకటన చేసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కమిషన్ వేసి కులగణనతోపాటు వెనుకబడిన వర్గాల వారిని గుర్తిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు ప్రతి బహిరంగ సభలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడటం రాజ్యాంగాన్ని అవహేళన చేయటమేనని అభిప్రాయపడ్డారు. సర్కారు ఒంటెత్తు పోకడలపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు కోండ్రు విజయ్, నియోజకవర్గ అధ్యక్షుడు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బొందలపాటి నాగేశ్వరరావు, మండల మహిళా అధ్యక్షురాలు నక్కా శ్రీదేవి పాల్గొన్నారు.
‘తానా’ నవలల పోటీకి రచనల ఆహ్వానం
తెనాలి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్లకోసారి నిర్వహించే నవలల పోటీని ఈ ఏడాది రూ.2 లక్షల బహుమతితో నిర్వహిస్తోంది. 1997 నుంచి జరుపుతున్న ఈ పోటీలను మధ్యలో కొంత విరామంతో 2017 నుంచి కొనసాగిస్తోంది. ఈ పోటీల్లో శప్తభూమి, నీల, ఒంటరి, కొండపొలం, మున్నీటి గీతలు, అర్థనారి నవలలు పలు అవార్డులను గెలిచాయి. కొండపొలం సినిమాగా రాగా, మున్నీటి గీతలు వెబ్‌సిరీస్‌గా వస్తోంది. రాబోయే జులై 3,4,5 తేదీల్లో డెట్రాయిట్‌లో జరగనున్న తానా మహాసభల సందర్భంగా మళ్లీ నవలల పోటీలు జరుపుతున్నట్టు తానా కార్యక్రమ నిర్వాహకులు జంపాల చౌదరి, ప్రచురణల కమిటీ అధ్యక్షుడు చంద్ర కన్నెగంటి గురువారం ప్రకటించారు. రచయితలు తమ రచనలను ఏప్రిల్ 15వ లోగా అక్షర క్రియేటర్స్, ఏజి–2, ఎ–బ్లాక్, మాతృశ్రీ అపార్ట్‌మెంట్స్, హైదర్‌గూడ, హైదరాబాద్–500029 చిరునామాకు పంపాలని వివరించారు. 98493 10560, 99496 56668 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఎస్జీటీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయంలో ప్రభుత్వ విద్యా కార్యక్రమాల సమన్వయం, నిరంతర పర్యవేక్షణ నిమిత్తం తాత్కాలికంగా పని చేసేందుకు అర్హత, ఆసక్తితో పాటు పూర్తిస్థాయిలో కంప్యూటర్ పరిజ్ఞానం గల ఎస్జీటీలు దరఖాస్తు చేసుకోవాలని ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీ చివరి తేదీ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment