‘దివ్య’ తేజస్సు
పాటిబండ్లలో పుట్టిన మత గురువులు
పెదకూరపాడు: కతోలిక్‌ల పుణ్యభూమి పాటిబండ్ల గ్రామంలో ముగ్గురు రాజులు దేవాలయ శత వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. వేలాదిగా తరలివస్తున్న రోమన్ కతోలిక్‌లు, వందలాదిగా తరలివచ్చిన మత గురువులు, మఠకన్యలు, విదేశీ భక్తులతో కోలాహలంగా మారింది. వార్షికోత్సవాల్లో భాగంగా రెండో రోజు నల్లపాడు సీనియర్ గురువులు రెవరెండ్ ఫాదర్ అల్లం శౌర్రెడ్డి పాటిబండ్ల గ్రామంలో పుట్టి వివిధ ప్రదేశాల్లో గురువులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న 60 మంది మత గురువులతో కలిసి ప్రత్యేక దివ్యబలిపూజ నిర్వహించారు. దాచేపల్లి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ యేరువ బాలశౌర్రెడ్డి ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ లోక ఆశలను వీడి, దేవుని ప్రేమలో నిలవాలని కోరారు. 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ముగ్గురు రాజులు దేవాలయం అనేక మందిని దేవుని సేవలో, ప్రేమలో నిలిపిందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పుట్టి వివిధ ప్రాంతాల్లో దైవసేవలో ఉన్న 60 మంది గురువులు, 200 మంది మఠకన్యలు ఒకే చోటకు చేరి సందడి చేశారు. వేడుకులు విజయవంతం చేసేందుకు ఆర్థిక, సామాజిక సహాయం అందించిన వారికి స్థానిక విచారణ గురువులు చిన్నాబత్తిన హృదయ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
అలరించిన సినీ సంగీత గాన లహరి
ముగ్గురు రాజులు ఆలయ శత వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్రీస్తు సంగీత గాన లహరి ఆకట్టుకుంది. గాయకులు ఆలపించిన క్రీస్తు భక్తిగీతాలు అలరించాయి. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి భక్తులు డప్పు వాయిద్యాలతో, భారీ బాణసంచా కాల్చుకుంటు, మొక్కులు తీర్చుకునేందుకు మోకాళ్లపై నడిచి దేవుని ఆలయానికి చేరుకుని కొవ్వొత్తులు సమర్పించారు.
మూడురోజులుగా నిత్యాన్నదానం
శత వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులు నిత్యం 25 వేల మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్నపానీయాలు అందుబాటులో ఉంచారు. ఆలయ ప్రాంగణం మొత్తం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల నుంచి వర్తకులు వచ్చి దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయాలు జరుపుతున్నారు.
పాటిబండ్లలో ఆధ్యాత్మిక సందడి
వైభవంగా ముగ్గురు రాజులు ఆలయశత వార్షికోత్సవాలు వందలాది మంది మత గురువులతో ప్రత్యేక దివ్యపూజ బలి వేలాదిగా తరలివస్తున్న కతోలిక్‌లు నిత్యం 20 వేల మందికి అన్నదానం అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు నేడు తరలిరానున్న తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులు
నేడు తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులు రాక
ముగ్గురు రాజులు ఆలయ శత వార్షికోత్సవం సందర్భంగా చివరి రోజు సోమవారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి 14 మంది పీఠాధిపతులు పాటిబండ్ల గ్రామాన్ని దర్శించనున్నారు. గుంటూరు పీఠాధిపతులు మహాఘన, రైట్ రెవరెండ్ చిన్నాబత్తిన భాగ్యయ్యతోపాటు 14 మంది పీఠాధిపతులు ప్రత్యేక దివ్యబలిపూజ నిర్వహించనున్నారు. శ్రీకాకుళం పీఠాధిపతులు మహాఘన రైట్ రెవరెండ్ డాక్టర్ రాయరాల విజయకుమార్ దేవుని సందేశం ఇవ్వనున్నారు. సాయంత్రం కోలాటం, బాణసంచాలతో ఊరేగింపు నిర్వహించనున్నట్లు విచారణ గురువు చిన్నాబత్తి హృదయ కుమార్ తెలిపారు. తిరునాళ్ల కూడా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment