తరతరాల ‘భూ’గోతం
అచ్చంపేట: మండలంలోని ఒకనాటి కోగంటిపాలెం అగ్రహారమే నేటి కోగంటివారిపాలెం గ్రామం. కృష్ణానదికి ఆనుకొని ఉంది. గ్రామంలో 1,200మంది జనాభా ఉంటారు. గ్రామ పరిధిలో 1,380 ఎకరాలకు పైగా సేద్యపు భూములున్నాయి. వీటిని గ్రామంతోపాటు పొరుగు గ్రామాలకు చెందిన 450మంది రైతులు సాగుచేసుకుంటున్నారు. అయితే, పంటలు వేసుకుని వచ్చే ఫలసాయాన్ని అనుభవించడానికి తప్పా మరేతర అవసరాలకు ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నారు. భూములన్నీ అగ్రహారం, ఇనాం, సత్రం భూములు కావడంవల్లే ఈ పరిస్థితి దాపురించింది. తమకు హక్కు కల్పించాలని కోరుతూ పలుమార్లు రైతులు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. కంటితడుపు చర్యగా సర్వే చేయించి హద్దులు వేయించారని, ఆన్‌లైన్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
భూములన్నీ అగ్రహారం బ్రాహ్మణులవే...
గ్రామంలోని భూములు మొత్తం బ్రాహ్మణులవే. జమీందారుల కాలంలో వీరికి దేవాలయాలలో ధూప దీప నైవేద్యలు నిర్వహించేందుకు, వారి పాండిత్యానికి మెచ్చి కానుకల రూపంలో ఇచ్చారు. గ్రామాలకు వచ్చిపోయే బాటసారులకు వసతులు కల్పించేందుకు గాను కొన్ని ఇచ్చారు. అయితే, ఆ భూములపై వచ్చే ఆదాయం చాలకపోవడం, గ్రామం నుంచి వలసలు వెళ్లిన కొందరు బ్రాహ్మణులు రైతులకు అమ్ముకున్నారు. గ్రామంలోని రైతులతోపాటు పక్క గ్రామాలైన రుద్రవరం, చిగురుపాడు, అంబడిపూడి గ్రామాలకు చెందిన కొందరు రైతులు వీరివద్ద భూములను కొనుగోలు చేశారు. సదావర్తి సత్రం నిర్వహణకు కేటాయించిన 80 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, రెండు, మూడేళ్లకు ఒకసారి బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఏడాదికి సగటున ఎకరాకు రూ.15,000 చొప్పున 75 ఎకరాలకు రూ.11.25లక్షల ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తూనే ఉన్నామని రైతులు చెబుతున్నారు.
అగ్రహారం, ఇనాం, సత్రం భూములు అంటే....
● మతపరమైన అవసరాల నిమిత్తం ఒక ప్రాంతంలోని కొంత భాగాన్ని గ్రామంగా రూపొందించి, అందులో నివసించే వారి భృతి కోసం కేటాయించిన భూములను అగ్రహారం భూములు అంటారు.
● ఇనాం భూములు అంటే జమీదారులను, రాజులను మెప్పించే విధంగా ప్రదర్శించే కళలు, సేవలకు మెచ్చి బహుమతిగా కానుకల రూపంలో ఇచ్చేవి.
● సత్రం భూములు అంటే గ్రామానికి వచ్చిపోయేవారి కోసం, గ్రామ సరిహద్దుల నుంచి వెళ్లే బాటసారుల కోసం సత్రాలు నిర్మించి, వాటి నిర్వహణకు కేటాయించిన భూములు.
విక్రయించుకునే హక్కు లేదు
అగ్రహారం, ఇనాం, సత్రం భూములను అనుభవించడమే గానీ అమ్ముకునే హక్కు లేదు. కాలగమనంలో చట్టంలో వచ్చిన అనేక మార్పులను ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని ఈ భూములపై తమకు హక్కు కల్పించే అవకాశాలున్నాయని గ్రామస్తులు కోరుతున్నారు. ముత్తాతలు, తాతలు, తండ్రుల నాటి కాలం నుంచి అనుభవిస్తున్న తమకు భూములపై హక్కులు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ తమను మభ్యపెడుతున్నారే తప్పా గోడు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
తగ్గిన భూముల విస్తీర్ణం
18వ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు జమీందారుగా పాలించిన రోజుల్లో కోగంటివారిపాలెంలో 1,380 ఎకరాల సేద్యపు భూములను కేటాయించారు. దేవాలయాలలో అర్చకత్వం వహించే బ్రాహ్మణులకు అగ్రహారం భూములుగా కొన్ని ఎకరాలు, ఇనాం కింద కొన్ని ఎకరాలు, సదావర్తి సత్రం నిర్వహణకు కొన్ని ఎకరాలను కేటాయించారు. కాలక్రమంలో కొన్ని ఎకరాల భూమి కృష్ణానది వరదలు వచ్చినప్పుడల్లా మునిగిపోయింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం అగ్రహారం, ఇనాం,సత్రం భూముల కింద 1,380 ఎకరాలు ఉన్నప్పటికీ భౌతికంగా లేదనేది గమనార్హం.
పేరుకే అగ్రహారం.. హక్కులు మాత్రం శూన్యం భూములపై నేటికీ హక్కు లేని రైతులు కనీసం పసుపుకుంకమ కింద కూతుళ్లకు భాగం ఇవ్వలేని తల్లిదండ్రులు భూములపై పుట్టని బ్యాంకు అప్పులు అందని ప్రభుత్వ రాయితీలు
పరిష్కారం చూపిస్తాం
గ్రామస్తులంతా సహకరిస్తే భూములు కలిగిన రైతులందరికీ పరిష్కారం చూపేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే భూములన్నింటిని రీ సర్వే చేశాం. సుమారు 450మంది రైతులున్నారు. వారిలో 100మందికి పైగా గతంలోనే ఫారం–8లు ఇచ్చాం. కొంతమంది రైతులు వాటివల్ల ఉపయోగంలేదు.. వద్దంటున్నారు. ముందుగా ఫారం–8లు అందరికీ ఇచ్చి ఏడీ సర్వేకు రిపోర్టు పంపాలి. ఏడీ సర్వే 13 నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఇలా ప్రాసెస్ జరిగిన తరువాత ఆ భూములను వెబ్‌ల్యాండ్‌లో చేర్చి ఆన్‌లైన్ చేస్తాం. ఆన్‌లైన్ చేస్తేనే పాసు పుస్తకాలు వస్తాయి. – జి.శ్రీనివాసయాదవ్, తహసీల్దారు, అచ్చంపేట
Comments
Please login to add a commentAdd a comment