టీడీపీ నేతల మట్టి దందా
● రైతు పొలం నుంచి అక్రమంగా తరలింపు ● తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు ● ఆత్మహత్య శరణ్యం అంటున్న రైతు
దుర్గి: ఓ రైతు సాగు చేసుకుంటున్న పొలంలో టీడీపీ నేతలు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండల పరిధిలోని కోలగుట్ల గ్రామానికి చెందిన రైతు కన్నెబోయిన బాల పేరయ్య 2.30 ఎకరాల భూమిని 13 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాడు. వైఎస్సార్ సీపీ పార్టీకి సానుభూతిపరుడుగా ఉన్న బాల పేరయ్య కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే గ్రామాన్ని విడిచి దుర్గిలో వ్యవసాయ పనులు చేచసుకుంటూ జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు గర్నె రమేష్, పీరబోయిన మన్నయ్య, ఈసబోయిన నాసరయ్య తన పొలంలో అక్రమంగా మట్టిని తరలించి అన్యాక్రాంతం చేస్తున్నారని పేరయ్య వాపోయాడు. విషయాన్ని స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి తెలియజేసినా స్పందించడం లేదని తెలిపారు. తన కుటుంబానికి జీవనాధారమైన భూమిని కాపాడాలంటూ సోమవారం నర్సరావుపేటలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం జరగకపోతే అదే పొలంలో ఆత్మహత్య శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్‌ను సాక్షి వివరణ అడగగా ఈ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment