సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ సోమవారం తెలిపారు. కాచిగూడ–శ్రీకాకుళం రోడ్డు (07615) మధ్య ప్రత్యేక రైలును ఈనెల 11, 15 తేదీలలో నడపనున్నట్టు వెల్లడించారు. శ్రీకాకుళం రోడ్డు–కాచిగూడ(07616) మధ్య ఈనెల 12, 16 తేదీలలో ప్రత్యేక రైలును నడపనున్నట్టుపేర్కొన్నారు. చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్డు( 07617) మధ్య ఈనెల 8న, శ్రీకాకుళం రోడ్డు–చర్లపల్లి(07618) మధ్య ఈనెల 9న ప్రత్యేక రైళ్లు నడుస్తాయని డీసీఎం వివరించారు. ఈ రైళ్లు గుంటూరు డివిజన్ మీదుగా ప్రయాణిస్తాయని పేర్కొన్నారు.
రాజకీయ పార్టీ
సమావేశంలో వీఆర్వో
సత్తెనపల్లి: అధికారులు రాజకీయాలకు అతీతంగా సేవలందించాలి. కానీ కొందరు అది మరచి నాయకుల సమావేశంలో పాల్గొంటూ వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకు వస్తున్నారు. సత్తెనపల్లిలోని రఘురామ్‌నగర్‌లో సోమ వారం నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్త మాదిరిగా సత్తెనపల్లి టౌన్ వీఆర్‌ఓ అరుణతో పాటు సచివాలయ ఉద్యోగులు పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మరి దీనిపై ఆ శాఖ జిల్లా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.
8న జిల్లాస్థాయి
రంగోత్సవ్ పోటీలు
యడ్లపాడు: జిల్లాస్థాయి రంగోత్సవ్ పోటీలు ఈనెల 8వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి గుంటూరు జిల్ల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్, పల్నాడు జిల్లా డీఈవో ఎల్. చంద్రకళ తెలిపారు. ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన జూనియర్ కళాశాలలు, ప్రైవేటు స్కూళ్లల్లో 6 నుంచి 12వ తరగతి చదివే బాలబాలికలకు పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్విజ్/స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాల డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్(తెలుగు, ఆంగ్లం), రంగోలి (ఐదుగురు సభ్యులు), జానపద నృత్యం, డిజిటల్ కాలేజ్ (యూనిటీ, సమైక్యత పోస్టర్), స్లోగన్ రైటింగ్ (ఏక్తా భారత్ శ్రేష్ఠ భారత్), రోల్‌ప్లే (భారత సంస్కృతి, చరిత్ర) వంటి ఎనిమిది విభాగాల్లో ఉంటాయని తెలిపారు. ప్రతి కళారూపానికి 5 నిమిషాల సమయం మాత్రమే ఉంటుందని, పోటీల్లో పాల్గొనే కళాకారులు అవసరమైన సామగ్రిని వారే తెచ్చుకోవాలని సూచించారు. గత ఏడాది రంగోత్సవ్ పోటీల్లో మొదటి మూడు విభాగాల్లో విజేతలైన వారు పోటీలో పాల్గొనడానికి అనర్హులని తెలిపారు. ఆసక్తి కల విద్యార్థులు వివరాలను జిల్లా విద్యాశిక్షణ సంస్థ మెయిల్‌కు పోస్టు చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు కళాశాలలో అధ్యాపకులు పి. పోలేరు, కె. ప్రసాద్ సెల్: 97047 90917ను సంప్రదించాలని తెలిపారు.
ఫిబ్రవరి 28లోగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలి
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని పెన్షన్‌దారులు ఫిబ్రవరి 28వ తేదీలోగా లైఫ్ ధ్రువీకరణ పత్రాలను కార్యాలయంలో అందజేయాలని జిల్లా ఖజానా శాఖ అధికారి వి. స్వామినాథన్ సోమవారం తెలిపారు. జిల్లా పరిధిలోని ఉప ఖజానా కార్యాలయాల్లో లైఫ్ సర్టిఫికెట్లు అందజేసి తమ పెన్షన్ ఆలస్యం కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. మీసేవా, సచివాలయం, జీవన ప్రమాణ యాప్‌ల్లో వివరాలు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. లైఫ్ సర్టిఫికెట్ అందజేసే సమయంలో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా నకలు తప్పనిసరిగా ఖజానా కార్యాలయంలో అందజేసి వివరాలను ఆన్‌లైన్ చేసుకోవాలని ఆయన సూచించారు.
స్టేట్ వేర్ హౌసింగ్
గోదాములు తనిఖీ
నరసరావుపేట: పట్టణంలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ బఫర్ గోదాములను జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టర్లు పరిశీలించి స్టాకు సక్రమంగా ఉందా లేదా అనేది చూశారు.
Comments
Please login to add a commentAdd a comment