పీకేజీ మేజర్ కాలువకు నీటి సరఫరా పునరుద్ధరణ
కారెంపూడి: పెదకొదమగుండ్ల మేజర్ కాలువకు ఎన్‌ఎస్‌పీ అధికారులు ఆదివారం సాయంత్రం సాగు నీటి సరఫరాను పునరుద్ధరించారు. ప్రధాన కుడి కాల్వ నుంచి మేజర్ కాలువకు నీరు విడుదలయ్యే దగ్గరున్న గేటు విరిగిపోయి ప్రవాహానికి అడ్డుపడడంతో సమస్య వచ్చింది. దీంతో 20 రోజులుగా కాల్వకు నీటి సరఫరా లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. రబీ వరి పైర్ల సాగు పనులు ముమ్మరంగా జరుగుతుండడంతో రైతులు నీటి కోసం ఆందోళన చెందారు. మూడు రోజులు ఎన్‌ఎస్‌పీ ఏఈ యరపతినేని రామయ్య, ఎన్‌ఎస్‌పీ సిబ్బంది రైతుల సహకారంతో గేటు మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. కాలువకు నీటి విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు నీటి సంఘం అధ్యక్షుడు పోలయ్య, బొమ్మిన శేషగిరి తదితరులు నీటి పునరుద్ధరణ చర్యల్లో పాల్గొన్నారు.
పులిచింతల ప్రాజెక్టుపై రాకపోకలు బంద్
అచ్చంపేట: మాదిపాడు నుంచి పులిచింతల ప్రాజెక్టు అప్రోచ్ రోడ్డు వరకు బీటీ రోడ్డు, గిరిజన తండాలైన కంచుబోడు, జడపల్లి తండాలలో సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్న కారణంగా పులిచింతల ప్రాజెక్టు పైనుంచి తెలంగాణకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేంత వరకు కృష్ణానదిని దాటాల్సిన ప్రయాణికులు బల్లకట్టు, పడవల ద్వారా వెళ్లాల్సి ఉంది. మామూలుగా అయితే కార్లు, మోటారు వాహనాలకు ప్రాజెక్టుపై నుంచి వెళ్లేందుకు అనుమతులున్నాయి. హైదరాబాద్‌లో ఉండె స్థానికులు అంతా ప్రతి సంక్రాంతి పండుగకు కార్ల ద్వారా వస్తూ ఉంటారు. కాగా ఈసారి అలాంటి వారికి ఇబ్బందులు తప్పవు.
సత్తెమ్మతల్లి ఆలయానికి ఆర్టీసీ బస్సు ప్రారంభం
అచ్చంపేట: మాదిపాడు పంచాయతీ పరిధిలోని అడవిలో ఉన్న సత్తెమ్మతల్లి ఆలయానికి ఆర్టీసీ బస్సును ఆదివారం ప్రారంభించారు. భక్తుల కోరిక మేరకు ఇకపై ప్రతి ఆదివారం మాదిపాడు ఆర్ అండ్‌బీ రోడ్డు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని అడవిలోగల అమ్మవారి దేవాలయానికి ఆర్టీసీ బస్సును సత్తెనపల్లి ఆర్టీసీ డిపో సిబ్బంది నడుపనున్నారు. ఎన్నోఏళ్లుగా అమ్మవారి ఆలయానికి బస్సు కావాలని కోరుతున్న భక్తుల కోరిక ఈనాటికి సాకారమైంది. ఇకపై ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఒకసారి, సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపు మరోసారి బస్సును తిప్పనున్నారు. భక్తులు నిర్దేశించిన సమయాలకు అనుగుణంగా తమ ప్రయాణాలను కొనసాగించాలని డిపో సిబ్బంది కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వల్లభనేని వెంకటేశ్వరరావు, కొలగాని సత్యనారాయణ, తోట వెంకయ్య, షేక్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
త్రిదండి చిన్న జీయర్‌స్వామి
తాడేపల్లిరూరల్: హిందూ దేవాలయాల పరిరక్షణకు యువత నడుం బిగించాలని, మన సనాతన ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని త్రిదండి చిన్నజీయర్‌స్వామి పిలుపునిచ్చారు. ఆదివారం మంగళగిరి బాపూజీ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ధనుర్మాస మహోత్సవాలు 21వ రోజుకు చేరుకుంది. 21వ పాశురాన్ని త్రిదండి చిన్నజీయర్‌స్వామి భక్తులకు వివరించారు. అనంతరం గోదా అమ్మవారికి అష్టోత్తరం, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ గన్నవరం, నగరిక, వైజాగ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి సుమారు 160 మంది భక్తులు గోదాదేవికి సారె సమర్పించి, స్వామి వారి మంగళాశాసనాలు అందుకున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment