నరసరావుపేట: జిల్లాలో అత్యధికంగా పింఛన్ పొందుతున్న వారిని తగ్గించి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వికలాంగులు, మంచానికే పరిమితమైన వారిలో వైఎస్సార్ సీపీకి చెందినవారున్నారని గత కొంతకాలంగా మంత్రులు, టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెరిఫికేషన్ పేరుతో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల పింఛన్లపై వేటువేసి తమ పార్టీ వారికి పింఛన్లు అందజేయాలనే కుటిల ఆలోచనతో తనిఖీలు, వైద్య పరీక్షలకు శ్రీకారం చుట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పార్టీలు, కుల, మతాలకు అతీతంగా పింఛన్లు అందజేసిన విషయం విదితమే.
ఐదు బృందాలతో వెరిఫికేషన్
పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లోనూ రీ అసెస్మెంట్, హెల్త్, వికలాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ సోమవారం నుంచి చేపట్టనున్నారు. దీనికోసం జిల్లా గ్రామీణాభివృద్ధి పథక సంచాలకులు బాలునాయక్, జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి.రవి, ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణాధికారి డాక్టర్ బీవీ రంగారావు ఆధ్వర్యంలో డాక్టర్లను ఐదు బృందాలుగా ఏర్పాటు చేశారు. వీరు అన్ని మండలాల్లోని 1,035 మంది లబ్ధిదారులను పరిశీలించనున్నారు.
ప్రాంతాల వారీగా వెరిఫికేషన్ ఇలా..
ఈనెల 6న నరసరావుపేట, వినుకొండ మున్సిపాలిటీలు, పిడుగురాళ్ళ, కారంపూడి, అమరావతి మండలాలలో వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 7న నరసరావుపేట, వినుకొండ, మాచర్ల, క్రోసూరు మండలాలు, పిడుగురాళ్ళ మున్సిపాలిటీల్లోను, 8న రొంపిచర్ల, ఈపూరు, దాచేపల్లి, బెల్లంకొండ మండలాలు, మాచర్ల మున్సిపాలిటీలోను, 16న చిలకలూరిపేట, బొల్లాపల్లి, గురజాల, వెల్దుర్తి, పెదకూరపాడు మండలాలు, 17న చిలకలూరిపేట మున్సిపాలిటీ, నూజండ్ల, మాచవరం, రెంటచింతల, అచ్చంపేట మండలాలు, 18న నాదెండ్ల, శావల్యాపురం, సత్తెనపల్లి, దుర్గి మండలాలు, 21న యడ్లపాడు మండలంతో పాటు, సత్తెనపల్లి మున్సిపాలిటీ, 22న రాజుపాలెం మండలం, 23న ముప్పాళ్ళ మండలం, 28న నకరికల్లు మండలంలోని మంచానికే పరిమితమైన పేషెంట్లను, వికలాంగుల వద్దకు డాక్టర్లు వెళ్లి పరీక్షిస్తారు. ఇదిలా ఉంటే హెల్త్ పింఛన్ల లబ్ధిదారుల్లో అత్యధికంగా అమరావతిలో 62 మంది ఉండగా, అత్యల్పంగా సత్తెనపల్లి మున్సిపాల్టీలో 8 మంది ఉన్నారు.
పరిశీలనకు ఐదు బృందాలు ఏర్పాటు ఈనెల 28 వరకు కొనసాగింపు మొత్తం 1,035 మంది పింఛన్ల తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment