ఏఎంసీ నూతనపాలకవర్గాలపై కసరత్తు
సత్తెనపల్లి: జిల్లాలోని 12 వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల నూతన పాలకవర్గాలను సంక్రాంతి నాటికి భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాత విధానం అమలు చేయాలా? కొత్తగా మార్గదర్శకాలను ఇస్తారా? అని ఆ శాఖ అధికారులు తర్జనభర్జన పడ్డారు. మరో వైపు పదవుల రిజర్వేషన్ల ప్రక్రియపై కసరత్తు కూడా పూర్తి కావడంతో అధికారికంగా ఉత్తర్వులు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. మరో పది రోజుల్లో పదవుల పందేరం జరగనుంది. కాకపోతే ఆశావాహులు ఇప్పటికే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై ఇప్పటికే ఒత్తిడి తీసుకువస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలకు ఏ స్థానం ఇవ్వాలి, సభ్యులుగా ఎంతమందికి అవకాశం ఇవ్వాలనే దానిపై నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జిల్లాలో చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, నరసరావుపేట, వినుకొండ, క్రోసూరు, మాచర్ల, రొంపిచర్ల, ఈపూరు, రాజుపాలెం, దుర్గి, గురజాల వ్యవసాయ మార్కెట్ కమిటీలు పనిచేస్తున్నాయి.
15 మంది సభ్యులతో కమిటీ
● ప్రతి కమిటీలో అధ్యక్ష, ఉపాధ్యక్షుడు, సన్న కారు రైతులు, పశుపోషకులు, వర్తకులు కలిపి 15 మంది సభ్యులుగా ఉంటారు. మరో నలుగురు అధికారులు, ఆయా మార్కెట్ యార్డు పరిధిలోని ఎమ్మెల్యే కూడా సభ్యుడిగా ఉంటారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రిజర్వేషన్ల విధానం తీసుకు వచ్చారు. మహిళలకు పెద్దపీట వేసి ప్రాధాన్యమిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలను భాగస్వాములను చేశారు. గత ప్రభుత్వం తరహాలో రిజర్వేషన్ల విధానం అమలు చేయడానికి ప్రస్తుత కూటమిలోని కీలక నేతలు వ్యతిరేకించి, తాము సిఫార్సు చేసిన వారికే పాలకవర్గంలో చోటు కల్పించాలని పట్టు పట్టారు. అయినప్పటికీ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరపడంతో చివరకు రిజర్వేషన్ విధానం ఖరారు చేశారు.
సంక్రాంతి నాటికి పదవుల భర్తీకి నిర్ణయం పల్నాడు జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలు
కలెక్టర్ నేతృత్వంలో రిజర్వేషన్లు ఖరారు
ప్రస్తుతం జిల్లాలోని 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లను కలెక్టర్ నేతృత్వంలో ఖరారు చేయగా ఎమ్మెల్యేలు అధికారికంగా వాటిని ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని సత్తెనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఓసీ మహిళకు, రాజుపాలెం బీసీ జనరల్‌కు ఖరారయ్యాయి. దీంతో చైర్మన్ పదవి తనకంటే తనకంటూ పెద్దమక్కెన, గుడిపూడి గ్రామాలకు చెందిన నేతలు పట్టుబడుతున్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయంలో శుక్రవారం బలాబలాలు నిరూపించుకునే స్థాయికి చేరుకున్నారు.
పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మైనార్టీలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇలా జిల్లాలో తమ వర్గానికి చైర్మన్ పదవి కేటాయించాలంటే తమ వర్గానికి కేటాయించాలని కీలక నేతలు పట్టుబడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment