నమ్మించి ‘రియల్’ చీట్
నరసరావుపేట టౌన్: నరసరావుపేటలో చిట్‌ఫండ్, రియల్ ఎస్టేట్ పేరిట నమ్మకంగా ప్రజల నుంచి నగదు గుంజుకుని వ్యాపారి పరారైన ఉదంతం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో రోజుకొక మోసం బయట పడటంతో నగదు దాచుకున్న వారి ఆవేదన అంతా ఇంతా కాదు. చిన్నచితకా పనులు చేసుకుని రూపాయి రూపాయి కూడగట్టుకుని ఈ ఘనుడి వద్ద పెట్టుబడిగా పెట్టిన వారు నిట్టనిలువునా మునిగారు. చీటీల రూపంలో నగదు దాచుకున్న వారు చేసేదేమీ లేక పోలీసు స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. శనివారం పలువురు బాధితులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసి నగదు పూర్తిగా చెల్లించి స్వాధీన పత్రం రాయించుకున్నవారు కొందరు, స్థలాలు కొని నాలుగోవంతు చెల్లించి అగ్రిమెంట్లు చేయించుకొన్న వారు మరికొందరు కూడా ఐజీని కలిసిన వారిలో ఉన్నారు. ప్లాట్లకు సంబంధించి నగదు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా విజయలక్ష్మీ టౌన్‌షిప్ ఎండీ పాలడగు పుల్లారావు మోహం చాటేశాడని వాపోయారు. తమతోపాటు అనేక మంది వద్ద పెద్ద మొత్తంలో నగదు తీసుకొని మోసం చేశాడని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా శుక్రవారం సాయిసాధన చిట్‌ఫండ్ స్కాంపై మాజీ కౌన్సిలర్ వేలూరి సుబ్బారెడ్డి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. చిట్‌ఫండ్ నిర్వహకుడు పుల్లారావు రూ.2.80 కోట్ల చిట్స్, డిపాజిట్స్ రూపంలో తీసుకొని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గుండెపోటుతో ఒకరు మృతి?
సదరు ఐపీ పెట్టిన వ్యక్తికి సుమారు రూ.2 కోట్ల వరకు నగదును ఒక వ్యాపారి వడ్డీకి ఇచ్చారు. మోసపోయానని తీవ్ర ఆవేదనకు గురవుతూ నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. అయితే బాధితుడు, మోసగించిన వ్యక్తి ఒకే సామాజిక వర్గం కావడంతో వారి పెద్దలు కేసుల వరకు వెళ్లకుండా నానా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మృతుడి బంధువులను బుజ్జగిస్తున్నట్లు సమాచారం. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మధ్యతరగతి వారే అధికం
రోజూ కూలినాలీ చేసుకుని సంపాదించుకున్న కొందరు ఈయన వద్ద చీటీల రూపంలో దాచుకున్నారు. అధిక వడ్డీ ఆశ చూపడంతో కట్టుకుంటూ వచ్చారు. తీరా చిట్ ఫండ్‌కు నాలుగేళ్లుగా రెన్యువల్ కూడా లేదని తెలిసి విస్తుపోతున్నారు. తమకు దిక్కెవరంటూ ఘొల్లుమంటున్నారు. చీటీలు పూర్తయిన వారు చాలా మంది తమకు రీఫండ్ చేయాలని కోరినప్పటికీ ఇల్లు నిర్మిస్తున్నామని, వేరే వ్యాపారంలో పెట్టానని సదరు వ్యక్తి చెబుతూ కాలయాపన చేసినట్టు బాధితులు వాపోతున్నారు.
నరసరావుపేటకు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబం రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టుకున్న సొమ్ముకు మరి కొంత వడ్డీ రూపంలో జత కూడితే పిల్లాడి చదువుకు ఉంటుందని ఆశపడింది. డబ్బు చేతికందుతుందని ఎదురుచూస్తున్న తరుణంలో సదరు వ్యాపారి బోర్డు తిప్పేసి వెళ్లాడని తెలిసి కుప్పకూలిపోయింది. నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోగా.. పరిహారం కింద వచ్చిన సొమ్మును చిట్‌ఫండ్ సంస్థలో డిపాజిట్ చేశారు. ప్రతి నెలా వచ్చే వడ్డీతో ఆ సంస్థలోనే చీటీపాట కడుతున్నారు. కూతురి పెళ్లికి దాచిన మొత్తంతో వ్యాపారి పరారయ్యాడని తెలుసుకొని కుంగిపోతున్నారు.
ఆస్తులన్నీ తాకట్టులోనే...
చిట్‌ఫండ్ స్కాంలో
బయటపడుతున్న విస్తుపోయే నిజాలు
బిల్డప్ చూసి మోసపోయిన
మధ్యతరగతి ప్రజలు
గుండె పోటుతో ఓ బాధితుడి మృతి?
పోలీసులకు సమాచారం
ఇవ్వకుండా సెటిల్‌మెంట్
తీవ్ర ఆవేదన చెందుతున్న
పలు కుటుంబాలు
గుంటూరు రేంజ్ ఐజీని
కలిసిన బాధితులు
తమకు న్యాయం చేయాలని వేడుకోలు
చిట్‌ఫండ్ వ్యాపారి అజ్ఞాతంలోకి వెళ్లినప్పటికీ ఆయనకున్న ఆస్తులు చూసి తమ డబ్బు తిరిగి వస్తుందని పలువురు భావించారు. కానీ సుమారు రూ.20 కోట్లతో నిర్మిస్తున్న భవనం ఇప్పటికే రూ.7 కోట్లకు ఓ ప్రముఖ బ్యాంక్‌లో తాకట్టులోఉందని వారికి తెలిసిందట. వాణిజ్య భవనంపై మరో రూ.2 కోట్ల రుణం తీసుకున్నట్టు సమాచారం. ఆయన భాగస్వామిగా ఉన్న మెగా వెంచర్‌లో తన వాటా కింద రావాల్సిన మొత్తం కంటే అదనంగా రూ.7 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధితులు ఇక తమ డబ్బు పరిస్థితి ఏంటంటూ గగ్గోలు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment