‘ఫీజు పోరు’కు వైఎస్సార్ సీపీ సిద్ధం
మాచర్ల: కూటమి ప్రభుత్వం తీరుతో రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ ఆస్తులు తాకట్టు పెట్టి విద్యాసంస్థలకు ఫీజులు చెల్లించాల్సి రావటంతో ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ ఇవేమీ పట్టకుండా వ్యవహరించటం చాలా దారుణమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై పోరాటానికి ‘ఫీజు పోరు’ చేయడానికి వైఎస్సార్ సీపీ సిద్ధమైందని చెప్పారు. శనివారం పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ‘ఫీజు పోరు’ పోస్టర్లను విడుదల చేసిన తర్వాత ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పంటలు పండక, మరోవైపు సంక్షేమ పథకాలు అందక ఆయా కుటుంబాల్లోని విద్యార్థులు చదువుకోవటానికి ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వారిని కూటమి ప్రభుత్వం అంధకారంలో ఉంచిందన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5న బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి తమ పార్టీ నాయకులు ‘ఫీజు పోరు’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఫీజులు చెల్లించలేదని పలు విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవటం, ఇబ్బందికి గురిచేయటంతో ఆందోళన చేస్తున్నారన్నారు. కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. గత గవర్నమెంట్ హయాంలో బకాయిలున్నాయని చెబుతున్న పాలకులు... ఆ వివరాలు ఎందుకు విడుదల చేయటం లేదని నిలదీశారు. జగన్ సీఎం అవ్వగానే గతంలో వారు పెట్టి వెళ్లిపోయిన బకాయిలను విద్యార్థులకు చెల్లించారని గుర్తుచేశారు. జగన్‌పై ఆరోపణలు చేస్తూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం సమంజసం కాదన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలలోని నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నరసరావుపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి 5న తరలిరావాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.
కూటమి ప్రభుత్వ తీరుతో
తీవ్ర అవస్థలు పడుతున్న విద్యార్థులు
వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా
అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
5న కలెక్టరేట్‌కు తరలిరావాలని
విద్యార్థులకు, తల్లిదండ్రులకు పిలుపు
Comments
Please login to add a commentAdd a comment