పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి
పార్వతీపురం: చిన్నారుల చేతుల పరిశుభ్రతపై దృష్టిసారించాలని అధికారులను కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ప్రపంచ మరుదొడ్ల దినోత్సవం, చేతుల పరిశుభ్రత, స్వచ్ఛసుందర పార్వతీపురం తదితర అంశాలపై బుధవారం ఆయన జిల్లా, మండల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాల, అంగన్వాడీ స్థాయినుంచే చిన్నారులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. చేతుల పరిశుభ్రతవల్ల 70శాతం వ్యాధులు సోకకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు. పాఠశాలలు, అంగన్వాడీలకు నిరంతరం నీటిసరఫరా ఉండాలని, మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. బహిరంగ మలవిసర్జన ఎక్కడా కనిపించకుండా చూడాలని స్పష్టం చేశారు. మరుగుదొడ్ల వినియోగంపై స్వయం సహాయక సంఘాల సభ్యులతో మహిళా ఆత్మగౌరవ సంఘాలు’ ఏర్పాటుచేయాలని డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడిని కలెక్టర్ ఆదేశించారు. మా మరుగుదొడ్డి–మా ఆత్మ గౌరవం నినాదంతో ముందుకు సాగాలని సూచించారు. అలాగే స్వచ్ఛ సుందర పార్వతీపురానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని డీపీఓ టి.కొండలరావును ఆదేశించారు.
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment