ఘంటసాల గానామృతానికి సర్వం సిద్ధం
విజయనగరం టౌన్: ఘంటసాల జయంతిని పురస్కరించుకుని 12 గంటల నిర్విరామ ఘంటసాల స్వరాభిషేకం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపకుడు ఎం.భీష్మారావు తెలిపారు. ఈ మేరకు కళాపీఠం ఆవరణలో మంగళవారం ఆయన ఆహ్వానపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఘంటసాల 102వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఆనందగజపతి ఆడిటోరియం ఆవరణలో ఈ నెల 4న బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామ ఘంటసాల స్వరాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రారంభ సభా కార్యక్రమానికి నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, సాయంత్రం సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశిష్ట అతిథిగా విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి హాజరవుతారన్నారు. ప్రముఖ గాయకులు సౌజన్య, జయంతి హారిక శివరాం తెలుగు ఇండియన్ ఐడల్ టీమ్ పాల్గొని అలనాటి ఘంటసాల పాటలతో అందరినీ అలరిస్తారన్నారు. ఎం.సాయికుమార్, పవన్‌కుమార్‌ల సంగీత వాయిద్య సహకారంతో గాయకులు తమ గానామృతాన్ని ఆలపిస్తారని, సంగీతాభిమానులందరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ధవళ సర్వేశ్వరరావు, గ్రంధి విష్ణు, వైవీవీ.సత్యనారాయణ (అబ్బులు) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment