క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్యంతో క్రీడా పాలసీ
● అమరావతిలో 2027 జాతీయ క్రీడలను నిర్వహించేందుకు సన్నాహాలు
● రాష్ట్ర రవాణా, క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
విజయనగరం: రాష్ట్రంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించడం ద్వారా క్రీడాంధ్ర ప్రదేశ్‌గా రూపొందించే లక్ష్యంతో దేశంలోనే అత్యుత్తమ క్రీడాపాలసీని తీసుకువచ్చినట్లు రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా అన్ని ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు, స్టేడియంలు, అకాడమీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు విజయనగరంలోని విజ్జి స్టేడియంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన మల్టీ పర్పస్ ఇండోర్ హాల్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతితో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విజ్జి స్టేడియంలోని మల్టీ పర్పస్ ఇండోర్ హాల్‌లో మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతి, కలెక్టర్ డాక్టర్ అంబేడ్కర్, శాప్ ఎం.డి గిరీశ తదితరులు కాసేపు షటిల్ ఆడారు. జిల్లాకు చెందిన క్రీడాకారులతో మంత్రులు, అధికారులు ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న 2 శాతం రిజర్వేషన్‌ను 3 శాతానికి పెంచినట్లు తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయి వరకు పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే జాతీయ క్రీడలను 2027లో అమరావతిలో నిర్వహించేందుకు ప్రణాళికా బద్ధంగా సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
యువతకు క్రీడలు ముఖ్యం
రాష్ట్ర చిన్న పరిశ్రమలు, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ. వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యలో క్రీడలను భాగంగా చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. యువతకు క్రీడలు ఎంతో ముఖ్యమని వారిని క్రీడల్లో ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో శాప్ ఎం.డి. గిరీశ, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డీఎస్‌డీఓ వేంకటేశ్వర రావు, డిప్యూటీ రవాణా కమిషనర్ మణికుమార్, రవాణా శాఖ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment