117 కిలోల గంజాయి పట్టివేత
విజయనగరం క్రైమ్: జిల్లాలోని ఎస్.కోట పోలీస్‌స్టేషన్ పరిధిలో బొడ్డవర చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి, పక్కా సమాచారంతో 117కిలోల 100 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. బొలెరో వాహనంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఎస్.కోట పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో సీఐ వీఎన్.మూర్తి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గురువారం బొడ్డవర చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి ఇద్దరు వ్యక్తులు బొలెరో వాహనంలో గంజాయిని కేరళ రాష్ట్రానికి తరలిస్తూ పట్టుబడ్డారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను విచారణ చేయగా కేరళ రాష్ట్రానికి చెందిన రామ్ అనే వ్యక్తి ఆదేశాలతో ముందుగా అరకు వచ్చి, అక్కడ వేరే వ్యక్తుల సహకారంతో ఒడిశా రాష్ట్రానికి వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి, ఎవరికీ అనుమానం రాకుండా వాహనం వెనుక భాగాన్ని ఒక అరగా మార్పు చేసి, దానిలో గంజాయిని డంప్ చేసి, కేరళ రాష్ట్రానికి తరలిస్తుండగా పట్టుబడ్డారు. నిందితులిద్దరూ కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లా చెర్పుకు చెందిన అన్సర్ పీఎ.అలియాస్ పడిక్కవిట్టి అన్సర్ (ఎ–2), అదేవిధంగా ఫిరోస్ కేకే (ఎ–3)లుగా గుర్తించామన్నారు. వారి నుంచి గంజాయి, వాహనం, రెండు మొబైల్ ఫోన్‌లు, రూ.10, 310 నగదు సీజ్ చేశామన్నారు. పట్టుబడిన గంజాయి రూ. 5 లక్షల 58వేల 500 ఉంటుందని ఎస్పీ తెలిపారు. విచారణలో ఈ కేసుతో కేరళ రాష్ట్రానికి చెందిన రామ్‌తో సహా మరో ఇద్దరికి సంబంధం ఉన్నట్లు గుర్తించామని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి, ఎస్బీ సీఐలు ఏవీ.లీలారావు, ఆర్‌వీఆర్‌కే.చౌదరి పాల్గొన్నారు.
బొడ్డవర చెక్‌పోస్టు వద్ద బొలెరో వాహనం సీజ్
ఇద్దరు నిందితుల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment