ఆదాయం ఘనం.. సౌకర్యాలు కనం..!
రామభద్రపురం: జిల్లాలో అతిపెద్దదైన రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్ అనేక సమస్యలతో సతమతమవుతోంది. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా కనీస అభివృద్ధికి నోచుకోలేదు. చినుకు పడితే మార్కెట్ అంతా చిత్తడిగా మారుతోంది. దీంతో కొనుగోలుదారులు, రైతులు, వినియోగదారులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్ అభివృద్ధి చేపట్టకపోవడంతో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మార్కెట్‌కు ప్రతిరోజూ రామభద్రపురం మండలంతో పాటు బొబ్బిలి,గజపతినగరం, మెంటాడ, దత్తిరాజేరు, బాడంగి, తెర్లాం సాలూరు, మక్కువ తదితర మండలాలకు చెందిన సుమారు 3వేల మంది రైతులు కూరగాయలు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు.అలాగే ఈజిల్లాకు చెందిన వ్యాపారులతో పాటు విశాఖపట్నం, శ్రీకాకులం, రావులపాలెం, రాజమండ్రి, విజయవాడ, ఇతర రాష్ట్రాలైన ఒడిశా, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లకు చెందిన వారు సుమారు 200 మంది వ్యాపారులు ఈ మార్కెట్‌లో కొనుగోలు చేసి వ్యాన్‌లు, బస్సులపైన రవాణా చేస్తుంటారు. ఈ మార్కెట్‌లో ప్రతిరోజూ సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. అలాగే రోజూ చిరు వ్యాపారులు సుమారు 100 మంది వరకు మార్కెట్‌పై ఆధారపడి జీవనోపాధిపొందుతున్నారు. కూరగాయలు రిటైల్‌గా విక్రయిస్తున్న చిరువ్యాపారులు ఒక్కో షెడ్డుకు రోజుకు రూ.50 నుంచి రూ.300 వరకు ఆసీలు చెల్లిస్తున్నారు.దీని ద్వారా ఏడాదికి పంచాయతీకి సుమారు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తున్నప్పటికీ కనీస సౌకర్యలు కల్పించడంలో పంచాయతీ, మార్కెటింగ్ అధికారులు నిర్లక్ష్యం చూపడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఎండ, వానకు రైతులు, వ్యాపారులు తలదాచుకునేందుకు నిలువ నీడలేక ఇబ్బంది పడాల్సిందే. వర్షం పడితే మార్కెట్ అంతా బురద మయమవుతుంది. ఆ బురదలోనే నిత్యం రైతులు, వ్యాపారులు కార్యకలాపాలు జరపాలి తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఉంది. రోజూ కురుస్తున్న కొద్దిపాటి వర్షానికి మార్కెట్ అంతా బురదమయం అవడంతో కూరగాయలు విక్రయానికి తెచ్చిన రైతులు కింద దించలేక తలపై ఉంచలేక నానా అవస్థలు పడుతుండగా కూరగాయలు కొనేందుకు బురదలో రైతుల వద్దకు వెళ్లేందుకు వ్యాపారులు అసహనం చూపుతున్నారు. పంచాయతీ అధికారులు రోజు వారీ నిర్వహణ సక్రమంగా లేక కూరగాయల వ్యర్థాలు కుళ్లిపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. సరైన సదుపాయాలు లేక ఆరికతోట, చౌదంతివలస, మెంటాడ, దత్తిరాజేరు వంటి గ్రామాలనుంచి వచ్చిన రైతుల సంఖ్య తగ్గుతోంది. వారు అక్కడి నుంచే వేరే ప్రాంతాలకు తీసుకుపోయి విక్రయించుకుంటున్నారు. అలాగే కొనుగోలు దారులు పెద్దగా రావడం లేదని రైతులు చెబుతున్నారు. వర్షం పడితే మార్కెట్‌కు కూరగాయలు తెచ్చి బురదలో విక్రయించేందుకు ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీకి ఆసీల రూపంలో ఆదాయం జాస్తిగా వస్తుంది కానీ సౌకర్యాల మెరుగుకు అధికారులు చొరవ చూపడంలేదని విమర్శిస్తునారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మార్కెట్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.
శంకుస్థాపనకే ఎమ్మెల్యే పరిమితం
రామభద్రపురం కూరగాయల మార్కెట్ అభివృద్ధికి స్థానిక నాయకులు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అక్టోబరు 7వ తేదీన శంకుస్థాపన చేశారు. రెండు నెలలు దాటుతున్నా ఇప్పటికీ కనీసం పట్టించుకోలేదు.
సమస్య పరిష్కారానికి చర్యలు
త్వరలో మార్కెట్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. మార్కెట్ అంతా సీసీ రోడ్డు వేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. తాత్కాలికంగా రాయి బుగ్గి వేస్తాం, అలాగే మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపడతాం
శ్రీనివాసరావు,
పంచాయతీ ఈవో, రామభద్రపురం
రైతులు తిడుతున్నారు..
వర్షం పడితే మార్కెట్ చిత్తడిగా మారడంతో రైతులు కూరగాయలు విక్రయించేందుకు ఇబ్బంది పడుతున్నారు. కూరగాయలు విక్రయించిన తరువాత ఆసీలు చెల్లించడానికి వచ్చినప్పుడు రైతులు ఆసీలు వదలకుండా తీసుకుంటారు కానీ మార్కెట్‌ను శుభ్రపరచరు, బురదలో కూరగాయలు ఎలా అమ్మమంటారని ప్రశ్నిస్తూ తిడుతున్నారు. మేము ఈ ఏడాది రూ.35 లక్షల పైబడి మార్కెట్ ఆసీలు వసూలు చేసేందుకు పాట పాడాం. ఆ నిధులు విడతలువిడతలుగా పంచాయతీకి చెల్లిస్తున్నాం. రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి పలుమార్లు అధికారులు దృష్ఠిలో పెట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
కనిమెరక సూర్యనారాయణ, ఆసీల వసూలుదారు
కూరగాయల తట్ట దించాలంటే ఇబ్బందిగా ఉంది..
చిన్నపాటి వర్షం పడిందంటే చాలు.కూరగాయల మార్కెట్‌కు ఇబ్బందిపడుతూ రావాల్సి వస్తోంది. మార్కెట్ అంతా బురదమయంగా ఉడడంతో కూరగాయలు విక్రయించేందుకు నానా బ్బందులు పడుతున్నాం. తలపై ఉన్న కూరగాయల తట్ట నేలపై దించి, వ్యాపారి కొనుగోలు చేసిన తరువాత మళ్లీ తట్ట తలపై పెట్టుకుని వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. అసీలు వసూలు చేసేందుకు ఉన్న శ్రద్ధ సౌకర్యాలు మెరుగుకు పంచాయతీ అధికారులు చూపడం లేదు. దీంతో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.
పూడి సత్యం,కూరగాయల రైతు
Comments
Please login to add a commentAdd a comment