చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ120 శ్రీ210 శ్రీ220
పైడితల్లికి స్వర్ణపుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి మార్గశిరమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని స్వర్ణపుష్పార్చన చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చన నిర్వహించారు. సిరిమానుపూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు.
పొలాల్లోకి దూసుకు పోయిన ఒడిశా బస్సు
గజపతినగరం: మండలంలోని మధుపాడ గ్రామం సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకు పోయింది. శుక్రవారం ఉదయం జరిగిన సంఘటన వివరాల్లోకి వెళ్తే ఒడిశా నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని తప్పించబోయి అదుపు తప్పి గజపతినగరం మండలం మధుపాడ గ్రామం సమీపంలో జాతీయ రహదారి పక్కన పొలాల్లోకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులతో పాటు అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సును జేసీబీ ద్వారా బయటకు తీశారు.
గిరిజన సంక్షేమాధికారిగా కె.శ్రీనివాసరావు
విజయనగరం అర్బన్: జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారిగా కె.శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతవరకు సాలూరు సహాయ గిరిజన సంక్షేమాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తూ ఇక్కడ డీటీడబ్ల్యూఓగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్‌ను, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్‌ను, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావుకు సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానన్నారు. అలాగే గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో మెరుగైన వసతులను కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
హైందవ శంఖారావాన్ని విజయవంతం చేయండి
విజయనగరం టౌన్: హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభను జనవరి 5న విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం వద్ద, కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి సీహెచ్‌వీ.రమణమూర్తి, ఎం.గణపతిరావులు తెలిపారు. ఈ మేరకు విజయనగరంలోని కోటవద్ద ఉన్న కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కరపత్రాలు, పోస్టర్‌లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ హైందవ శంఖారావంలో భాగంగా ఈ నెల 22న విజయనగరం జిల్లా కేంద్రంలో 20 ప్రాంతాల్లో హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. చలో విజయవాడకు విజయనగరం జిల్లా నుంచి మూడురైళ్లు, 25 బస్సులు, 100 కార్లు, టూవీలర్స్ ద్వారా హిందూ బంధువులందరూ హాజరుకానున్నారని తెలిపారు. సమావేశంలో టౌన్ కన్వీనర్ పి.ఉమాశంకర్, తోట శ్రీధర్‌బాబు, జీబీ.వెంకటపతిరాజు, కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment