ప్రతిభా ప్రదర్శనలకు వేళాయె...
పాలకొండ రూరల్: బాలమేధావుల్లో దాగిఉన్న అంతర్గత సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ, ఏపీఎస్సీఈఆర్టీ ఆదేశాల మేరకు జిల్లాలో సైన్స్ ప్రాజెక్టుల ఎగ్జిబిషన్‌కు కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నారు. 15 మండలాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో బోధన పొందుతున్న 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు సైన్సు ప్రాజెక్టుల ప్రదర్శనలో పాల్గొననున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించే మండల స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనలు, సదరు ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులు జనవరి 3వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు నేరుగా అర్హత సాఽధించనున్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో 1,698 పాఠశాలలు ఉండగా వీటిలో 1,18,346మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో 212 ఉన్నత పాఠశాలల్లో 37,215 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 10,436 మంది 10వ తరగతి చదువుతున్నారు. వీరంతా సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనకు అర్హులేనని జిల్లా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
మండల స్థాయిలో....
నేడు తలపెట్టిన ఈ ప్రదర్శనలు ఇదివరకే ఎంపిక చేసిన మండల స్థాయి పాఠశాలల్లో పోటీలు జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థి వ్యక్తిగత ప్రాజెక్టు, గ్రూప్ ప్రాజెక్టు, టీచర్ ప్రాజెక్టుల వారీగా మూడు కేటగిరిల్లో ప్రదర్శనలో పాల్గొన వచ్చు. ఈ సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్, ఎర్త్ /స్పేస్ సైన్స్, ఎన్విరాన్మెంట్, ఇంజినీరింగ్, బయో సైన్స్ /బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అనే ఉప అంశాలపై పాల్గొనాల్సి ఉంటుంది. వీటిలో ఎంపికై న వారు జిల్లా స్థాయిలో జరిగే ప్రదర్శనకు అర్హత సాధిస్తారు. జిల్లా స్థాయి సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనలు వచ్చే నెల జనవరి 3వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో చర్చి వీధిలో గల డీవీఎంఎం ఉన్నత పాఠశాల వేదికగా జరగనున్నాయి. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యా శాఖాధికారి ఎన్.తిరుపతినాయుడు పర్యవేక్షణలో జిల్లా సైన్స్ అధికారి గిరడ లక్ష్మణరావు ఇప్పటికే 11 కమిటీల ద్వారా ఏర్పాట్లు చేపట్టారు. దీనికి సమగ్రశిక్ష ద్వారా నిధులు సమకూరుస్తున్నట్లు జిల్లా అడిషనల్ ప్రాజెక్టు అధికారి ఆర్.తేజేశ్వరరావు తెలిపారు.
11 కమిటీలతో ఏర్పాట్లు
జిల్లాలో 15 మండలాల్లో నిబంధనల మేరకు ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ ప్రదర్శనలు సోమవారం జరగనున్నాయి. వీటి నిర్వహణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఇదివరకే 11 కమిటీలను వేసి ఏర్పాట్లు చేపట్టాం. అన్ని పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు తమ పరిధిలో విద్యార్థులచే ప్రాజెక్టులు సిద్ధం చేయించారు. వారిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రాజెక్టులు జిల్లా స్థాయికి నేరుగా ఎంపిక కాబడతాయి.
– గిరడ లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా
జనవరి 3న
జిల్లా స్థాయి ప్రదర్శనలు
మండల స్థాయి పోటీల అనంతరం వచ్చే నెల జనవరి 3న జిల్లా స్థాయి ప్రదర్శనలు చేపడతాం. పాఠశాల విద్యా శాఖ, ఏపీఎస్సీఈఆర్టీ ఆదేశాల మేరకు ఈ ఏడాది మండల స్థాయి, జిల్లా స్థాయి పోటీల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్‌ను ప్రకటించాం. జిల్లాలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రదర్శనలను విజయవంతం చేయాలి.
– ఎన్.తిరుపతినాయుడు,
జిల్లా విద్యా శాఖాఽధికారి, పార్వతీపురం మన్యం
Comments
Please login to add a commentAdd a comment