రక్తహీనత రహిత జిల్లాయే లక్ష్యం
సాక్షి, పార్వతీపురం మన్యం: నూతన సంవత్సరంలో జిల్లాను రక్తహీనత నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 సంవ త్సరంలో చేపట్టిన కార్యక్రమాలను, 2025లో నూత న ప్రణాళికలను వివరించారు. రక్తహీనత నియంత్రణ కు గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి .. గర్భిణులను దత్తత తీసుకునేందుకు దత్తత అధికారులను నియమించినట్లు తెలిపారు. గుమ్మలక్ష్మీపురం, సాలూరు, సీతంపేటల్లో గర్భిణుల కోసం ప్రత్యేక వసతిగృహాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
మరో మూడు చోట్ల కంటైనర్ వైద్య సేవలు
రాష్ట్రంలోనే తొలిసారిగా సాలూరు మండలం తోణాం పీహెచ్‌సీ పరిధి కారడవ లసలో కంటైనర్ ఆధారిత ఆసుపత్రి (గిరి వైద్య ఆరోగ్య కేంద్రం) సేవలను ప్రారంభించామని చెప్పారు. కురుపాం నియోజకవర్గంలో రెండు, పాలకొండ నియోజకవర్గంలోని భామిని మండలంలో ఒకటి రాబోయే వారంలో ప్రారంభిస్తామని స్పష్టంచేశారు.
మలేరియా నివారణకు చర్యలు
జిల్లాలో మలేరియా నివారణకు డ్రోన్‌ల ద్వారా ఐఆర్‌ఎస్ పిచికారీ చేయడంతోపాటు గతేడాది లక్ష గంబూషియా చేపల పెంపకం చేపట్టినట్లు తెలిపారు. వసతిగృహాల్లో కొన్ని అనారోగ్య కారణాల కేసులు నమోదయ్యాయని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మరమ్మతుల కోసం సుమారు రూ.189 లక్షలు మంజూరైనట్లు వివరించారు.
డోలీల మోత తప్పేలా...
గిరి శిఖర ప్రాంతాల్లో డోలీల మోత తప్పేలా రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. 31.72 కిలోమీటర్ల మేర రూ. 29.61 కోట్ల వ్యయంతో 19 రోడ్లు వేస్తున్నామని చెప్పారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.211 కోట్లతో దాదాపు 472 పనులు మంజూరయ్యాయని, వీటిలో ఇప్పటికే రూ.102 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇందులో 190 తారు రోడ్లు, రక్షణ గోడలు ఉన్నాయని చెప్పారు. అన్ని గ్రామాలకు కనెక్టివిటీ ఉండేలా రోడ్ల కోసం రూ. 570 కోట్లు అవసరమని అంచనా వేశామని తెలిపారు. రూ.23 కోట్లతో గుంతల లేని రహదారుల పనులు జరుగుతున్నాయని, వచ్చే మార్చి నాటికి ముగుస్తుందని చెప్పారు.
– పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ.. చెత్త నుంచి సంపదను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
– జీవనోపాధి కార్యక్రమాల కింద జీడిపప్పు, పసుపు, చింతపండు, కుట్టు తదితర రంగాల్లో 78 వన్ ధన్ వికాస్ కేంద్రాలను (వీడీవీకే) బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. దాదాపు 713 రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాయని, 4,660 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు.
– జిల్లాలోని 1,987 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.1432 కోట్లతో వాటర్ గ్రిడ్ నిర్మాణం కోసం ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. జంగిల్ క్లియరెన్స్ కింద 95 పనులను రూ.30 కోట్లతో చేపట్టామన్నారు. 2025 ఫిబ్రవరి నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు.
కొత్త సంవత్సరంలో నూతన ప్రణాళికలు
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment