ఐసీడీఎస్‌లో అవినీతి అనకొండలు!
● కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల్లోనూ ‘చేతివాటం’ ● తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ● జిల్లా అధికారిణిపై చర్యలు ● కొత్త మహిళా శిశు సంక్షేమ అధికారిణిగా కనకదుర్గ నియామకం
సాక్షి, పార్వతీపురం మన్యం: ఐసీడీఎస్ అంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్. అంగన్‌వాడీలకు సరఫరా చేసే పాలు, గుడ్లు తదితర పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టించడమే కాక.. మహిళాశిశు సాధికారిత కోసం పలు కార్యక్రమాలు చేపట్టకుండానే ‘చేపట్టినట్లు’ బిల్లులు చేసుకోవడం వరకూ అక్కడి అధికారులది అందెవేసిన చేయి. ఇంకా.. ఆ శాఖలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు జరిగాయంటే.. ‘ఉన్నత’ స్థానంలో ఉన్న అధికారులకు పండగే. ఒక్కో పోస్టుకు రూ.లక్షల్లో దండుకుంటారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నా యి. కొత్తగా ఏర్పడిన జిల్లా కావడంతో ఇటీవల జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్)లో పలు విభాగాల పోస్టులను భర్తీ చేశారు. దీనికితోడు మహిళల రక్షణ కోసం వన్‌స్టాప్ సెంటర్(సఖి)ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ పోస్టుల భర్తీలో నిబంధనలకు నీళ్లు వదిలి.. ‘బంధుప్రీతి’, ‘నగదు బదిలీ’తో నియామకాలు జరుపుకొన్నారు. బాలల కోసం పని చేసే విభాగంలో ఇప్పటికే భర్త లు ఉన్నచోట్ల.. మూడు పోస్టుల వరకు వారి భార్యలను నియమించుకోవడం చూస్తుంటే.. ఎంతగా ‘బంధుప్రీతి’ పని చేసిందో అర్థం చేసుకోవచ్చు. వన్‌స్టాప్ సెంటర్ నియామకాల్లోనూ పోస్టును బట్టి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణ లు ఉన్నాయి. ఏడాదిగా బాలసదన్‌లో పిల్లలు లేకుండానే.. ఉన్నట్లు చూపించి, ఉద్యోగులకు జీతాలతో పాటు.. మిగతా బిల్లులను పెట్టుకుని పెద్దఎత్తున నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాల్యవివాహాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతా ల్లో పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేయాలని ప్రభు త్వం ఆదేశిస్తే.. అసలు ఏర్పాటు చేయకుండానే రూ.లక్షల్లో నిధులు డ్రా చేసుకున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై అధికారిక సమావేశంలోనే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర ఛైర్మన్ కేసలి అప్పారావు జిల్లా ఐసీడీఎస్ అధికారులను నిలదీశారు.
జిల్లా అధికారిణిపై ఆరోపణలు
మహిళాశిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారిణి గా ఇప్పటి వరకు వ్యవహరించిన ఎం.ఎన్.రాణిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పనికీ.. ఉద్యోగానికీ ఒక రేటు పెట్టేశారన్న విమర్శలు ఉన్నాయి. సొంత శాఖలోనే పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఇలాంటి అవినీతి దందాకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని భోగట్టా. సదరు ఉద్యోగిని చూస్తే, రెగ్యులర్ ఉద్యోగులు సైతం హడలిపోయే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఈ అవినీతి దందాపై గతంలోనే పలుమార్లు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. దీనిపై ఆయన హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆమైపె చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారుల కు సిఫారసు చేశా రు. ఈ క్రమంలోనే ఇన్‌చార్జి పథక అధికారిణిగా వ్యహరిస్తున్న ఎంఎన్ రాణిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఆ స్థానంలో రాజాం సీడీపీఓగా పని చేస్తున్న తోట కనక దుర్గను జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిణిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యా యి. జిల్లా ఐసీడీఎస్‌లో జరుగుతున్న అవినీతి భాగోతంపై రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన పోస్టును కాపాడు కునేందుకు ఇప్పటివరకు ఉన్న పథక అధికారిణి ప్రయత్నించగా.. ‘ఇప్పటికే ఆలస్యం అయిందని’ మంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment